శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు రవాణా కష్టాలు లేకుండా దక్షిణాది రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ సమీపిస్తుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివెళ్లనున్న నేపథ్యంలో.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు సిద్ధమవుతున్నాయి.
శబరిమల ఆలయం మండల యాత్ర కోసం నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. అదే రోజు నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. డిసెంబర్ 27న మండల పూజతో మండల కాలం ముగియనుండగా.. మకరవిళక్కు పండుగ 2027 జనవరి 14న జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరనున్నారు.
భక్తులకు ప్రత్యేక బస్సులు
అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక అద్దె ప్రాతిపదికన బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్రూపులుగా ప్రయాణించే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. యాత్రలో భక్తులు ఆహారం తయారు చేసుకునేందుకు వీలుగా బృందంతో పాటు వచ్చే వంటవారు, ఇతర సహాయకులతో కలిపి ఏడుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అలాగే, కనీసం ఐదు రోజుల కాలానికి ప్రత్యేక బస్సులను బుక్ చేసే గురుస్వాములు లేదా ఏజెంట్లకు ఏపీఎస్‌ఆర్టీసీ రూ.2,000 కమీషన్ అందించనుంది.
శబరిమల మార్గంలో ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉండటంతో బస్సుల ఎంపికలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో ఆధునిక ఆడియో, వీడియో సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక, అమరావతి ఏసీ నుంచి పల్లె వెలుగు వరకు మొత్తం తొమ్మిది రకాల బస్సులను ప్రత్యేక అద్దె ప్యాకేజీలో చేర్చారు.
బస్సుల వారీగా కిలోమీటర్ ధరలు ఇలా..
అమరావతి ఏసీ-₹120
ఇంద్ర ఏసీ-₹79
స్టార్ లైనర్-₹66
ఎక్స్‌ప్రెస్-₹62
సప్తగిరి ఎక్స్‌ప్రెస్’-₹62
అల్ట్రా పల్లె వెలుగు-₹62
అల్ట్రా డీలక్స్-₹61
సూపర్ లగ్జరీ-₹57
పల్లె వెలుగు-₹52
తెలంగాణ నుంచి ప్రత్యేక బస్సులు
తెలంగాణ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించే అవకాశం ఉంది. మార్గాలు, షెడ్యూల్లు, బుకింగ్ వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా.. మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందే దక్షిణాది రాష్ట్రాల రవాణా సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ మరిన్ని ప్రత్యేక ప్రజా రవాణా సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తమిళనాడు నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు
ఇదిలా ఉండగా.. తమిళనాడు నుంచి కూడా శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SETC) నవంబర్ నుంచి జనవరి మధ్య ప్రత్యేక సర్వీసులను నడిపే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు నుంచి శబరిమలకు వెళ్లే భక్తులకు అదనపు రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.
కర్ణాటక నుంచి నిలక్కల్‌కు ప్రత్యేక బస్సులు
కర్ణాటకలోనూ శబరిమల భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బెంగళూరు నుంచి నిలక్కల్ వరకు ప్రత్యేక బస్సులు నడిపే ప్రతిపాదన ఉంది. పంపా, శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు నిలక్కల్ కీలక రవాణా కేంద్రం కావడంతో ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
ఇదీ చదవండి: పది నెలల కంపెనీకి ఫ్రీగా 40 ఎకరాల భూమి..


