అక్టోబర్ రాకతో నైరుతి రుతుపవనాలు ముగిశాయి.. ఇక వాతావరణంలో మరో కీలక మార్పు మొదలుకానుంది. ఎల్‌నినో మరింత బలపడుతున్న వేళ.. అక్టోబర్ నుంచే దాని ప్రభావం కనిపించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈశాన్య సీజన్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో..
చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందట. ఈ మేరకు వాతావరణ ఔట్‌లుక్‌ను తాజాగా విడుదల చేసిన ఐఎండీ.. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు అక్టోబర్ నుంచి పుంజుకుని, నవంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశముందని పేర్కొంది. రాబోయే రోజుల్లో.. దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని చెబుతోంది. అయితే వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందట!.
నైరుతి మాదిరే.. అక్టోబర్–డిసెంబర్ పోస్ట్ మాన్సూన్ సీజన్‌లోనూ దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతోపాటు ఉష్ణోగ్రతలపైనా ఐఎండీ కీలక అంచనాలు వెల్లడించింది. అక్టోబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో వర్షాలు తగ్గే పరిస్థితులతోపాటు పగటి వేడి కొనసాగొచ్చని అంచనా.
నవంబర్‌లో పీక్స్‌కు..
ప్రస్తుతం దేశంలో ఎల్‌నినో పరస్థితులు కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లో మరింత బలపడనున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ప్రకారం.. రాబోయే నెలల్లో ఎల్‌నినో ‘హై’ స్థాయికి చేరే అవకాశముంది. నవంబర్–డిసెంబర్ నాటికి గరిష్ఠ తీవ్రతకు చేరే అవకాశముందని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఈ ప్రభావం 2027 ప్రారంభం వరకూ కొనసాగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి జూలైలో ఇచ్చిన సమాధానంలోనూ ఐఎండీ.. అక్టోబర్–డిసెంబర్ 2026లో ఎల్‌నినో మరింత బలపడి ‘వెరీ స్ట్రాంగ్’ కేటగిరీకి చేరొచ్చని తెలిపింది.
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలుల ప్రసరణపై ప్రభావం చూపగలదు. భారత్‌లో ఎల్‌నినో పరిస్థితులు సాధారణంగా రుతుపవన వర్షాలను బలహీనపరిచే అవకాశంతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే భారత వర్షపాతాన్ని ఎల్‌నినో ఒక్కటే నిర్ణయించదు. ఐఓడీ, ఎంఎన్‌జే వంటి ఇతర సముద్ర–వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
13 శాతం లోటుతో నైరుతి..
ఇప్పటికే 2026 నైరుతి రుతుపవనాలు 12.6 శాతం లోటుతో ముగిశాయి. జూన్–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 109.2 మిల్లీమీటర్ల లోటు. ఈ లోటుతో 2026 నైరుతి సీజన్ 2001 తర్వాత నాలుగో అత్యల్ప వర్షపాతం నమోదైన సీజన్‌గా నిలిచింది.
ఈసారి దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. అయితే వర్షపాతాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఎల్‌నినోతోపాటు అల్పపీడనాలు, మాడెన్–జూలియన్ ఆసిలేషన్ (ఎంఎన్‌జే) వంటి ఇతర వాతావరణ వ్యవస్థలూ ఉన్నాయి. అందువల్ల సీజన్‌లో నమోదైన లోటును ఎల్‌నినో ఒక్కదానికే ఆపాదించలేమని ఐఎండీ వివరించింది.
దక్షిణాదికి కొంత ఊరట
దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. దక్షిణ ద్వీపకల్ప భారతానికి కొంత ఊరట ఉంది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఈ ప్రాంతంలో మొత్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ప్రాంతాలవారీగా పరిస్థితుల్లో తేడాలు మాత్రం ఉండొచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్ ఇంతటితో పోదు!


