నటి ప్రత్యూష కేసులో మాజీ ప్రియుడికి ఊరట | Balika Vadhu Pratyusha Banerjee Case: Bombay HC Discharges Rahul Raj Singh | Sakshi
Sakshi News home page

నటి ప్రత్యూష కేసులో మాజీ ప్రియుడికి ఊరట

Oct 1 2026 8:47 AM | Updated on Oct 1 2026 8:47 AM

Balika Vadhu Pratyusha Banerjee Case: Bombay HC Discharges Rahul Raj Singh

ప్రముఖ టీవీ నటి, ‘బాలికా వధు’ ఫేమ్‌ ప్రత్యూష బెనర్జీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడు, నటుడు–నిర్మాత రాహుల్‌ రాజ్‌ సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి ఇస్తూ బాంబే హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. తీర్పు సందర్భంగా.. ఇక ఆయన ఎలాంటి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

హిందీ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ పదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమెను ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారన్నది ప్రధాని అభియోగం. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో ప్రత్యూష బెనర్జీ మరణానికి ముందు రాహుల్‌ రాజ్‌ సింగ్‌తో మాట్లాడిన చివరి ఫోన్‌ సంభాషణను కోర్టు కీలకంగా పరిగణించింది. 

ఆనాడు.. ఈ సంభాషణలో ప్రత్యూష తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ట్రాన్స్‌క్రిప్ట్‌ ద్వారా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. అదే సమయంలో రాహుల్‌ ఆమెను ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. తాను కారును వెనక్కి తిప్పుకుని ఆమెను కలిసేందుకు వస్తున్నానని కూడా రాహుల్‌ చెప్పినట్లు కోర్టు గుర్తించింది. ఈ సంభాషణను పరిశీలించిన న్యాయస్థానం.. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలకు ఇది అనుకూలంగా లేదన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది.

పదేళ్ల క్రితం ఏం జరిగిందంటే..
పాపులర్‌ సీరియల్‌ ‘బాలికా వధు’లో ఆనంది పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ 2016 ఏప్రిల్‌ 1న ముంబైలోని గోరేగావ్‌లో తాను అద్దెకు ఉంటున్న నివాసంలో మృతిచెందారు. ఆమె మరణం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రత్యూష తల్లిదండ్రులు ఆమెతో అప్పట్లో సహజీవనం చేస్తున్న రాహుల్‌ రాజ్‌ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారని.. ఆమె ఆత్మహత్యకు రాహుల్‌ ప్రేరేపించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత..
కేసు నమోదైన కొన్ని నెలలకే 2016 జూలైలో రాహుల్‌ రాజ్‌ సింగ్‌కు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం పోలీసులు 2018లో చార్జిషీట్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయాలని రాహుల్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.

రాహుల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆబాద్‌ పొండా, న్యాయవాది శ్రేయాన్ష్‌ మిథారే వాదనలు వినిపించారు. ప్రత్యూషతో జరిగిన చివరి ఫోన్‌ సంభాషణలో ఆమెను తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని రాహుల్‌ నచ్చజెప్పిన విషయం స్పష్టంగా ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని వాదించారు. అలాగే ప్రత్యూష తన నిర్ణయానికి సంబంధించి పలువురి పేర్లను ప్రస్తావించిందని.. ఆమె తల్లిదండ్రుల గురించి కూడా సంభాషణలో మాట్లాడిందని రాహుల్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆత్మహత్య లేఖ కూడా లేని పరిస్థితుల్లో తొందరగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని వారు వాదించారు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న బాంబే హైకోర్టు.. రాహుల్‌ రాజ్‌ సింగ్‌ను కేసు నుంచి డిశ్చార్జ్‌ చేసింది. దీంతో క్రిమినల్‌ ట్రయల్‌ నుంచి ఆయనకు ఊరట లభించినట్లైంది.

ఇదీ చదవండి: వాటికి ఇంకెప్పుడు మోక్షమయ్యా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement