‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా వారాహి మల్లిపాముల అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. 'మా ఇంటి బంగారం' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో తెలుగు మహిళ యషా ముత్తులూరి నటించారు.
వారాహి మల్లిపాముల మాట్లాడుతూ.. 'నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి మా అమ్మ చాలా ఖర్చు పెట్టారు. అందుకే ఆ డబ్బును సినిమాలో పెట్టాలనుకుంటే ఇస్తానని చెప్పారు. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించా. కానీ ఆ డబ్బుతో ఒక పూర్తి సినిమా తీయలేకపోయాను. మేము ఇంకా చాలా అప్పు చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి నేను న్యూయార్క్ నుంచి వచ్చా" అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ..'నాకు చిన్నప్పటి నుంచే సినిమాపై బలమైన నమ్మకం ఉంది. కానీ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని నిర్మించేలా నిర్మాతలను ఒప్పించడం అంత సులభం కాదు. నేను రాసిన స్క్రిప్ట్‌ని ఎంతో మంది నిర్మాతలకు వినిపించా. చాలామంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. చివరికి సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించి మహిళా ప్రాధాన్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదరించవచ్చని నిరూపించారు. థియేటర్లలో 'ఇంప్యూర్' చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేయడానికి వారే నాకు స్ఫూర్తి. మా ఇంటి బంగారం’ చిత్రంలానే 'ఇంప్యూర్' సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా" అని అన్నారు.
కాగా.. ఇంప్యూర్ వరల్డ్ ప్రీమియర్ లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో జరిగింది. ఆ తర్వాత న్యూయార్క్‌లోని చారిత్రాత్మక సినిమా విలేజ్‌లో ఈస్ట్ కోస్ట్ ప్రీమియర్ జరిగింది. ఈ చిత్రం అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.


