ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగుల అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చింది. ప్రధానంగా ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సమ్మె ప్రతిపాదించారు. అయితే సెప్టెంబర్ 27 రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యూఎఫ్‌బీయూ మధ్య చర్చలు జరగడంతో సమ్మెను వాయిదా వేశారు. మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించే అంశంపై ఇరు వర్గాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వ బ్యాంకుల్లో జీతాలు ఎలా ఉంటాయి?
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులకు 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం ప్రకారం సవరించిన పే స్కేల్స్ అమల్లో ఉన్నాయి. ఈ ఒప్పందం 2024 మార్చిలో కుదిరింది. 2022 నవంబర్ 1 నుంచి అమలయ్యేలా కొత్త వేతన స్కేల్స్ రూపొందించారు. క్లరికల్ సిబ్బందికి ప్రారంభ బేసిక్ పే రూ.24,050గా నిర్ణయించారు. అంతకుముందు ఇది రూ.17,900గా ఉండేది.
అయితే బేసిక్ పేనే ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం కాదు. దీనికి డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ఇతర అలవెన్సులు, ప్రత్యేక చెల్లింపులు జత అవుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్/NPS వంటి కోతలు ఉంటాయి.
ఆఫీసర్‌గా చేరితే ఎంత?
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I అధికారులకు 12వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ప్రారంభ బేసిక్ పే రూ.48,480 నుంచి మొదలవుతుంది. స్కేల్-I నుంచి స్కేల్-VII వరకు అధికారుల సవరించిన బేసిక్ పే స్కేల్ రూ.48,480 నుంచి రూ.1,73,860 వరకు ఉంటుంది. అర్హతలు, అనుభవం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల ఆధారంగా వేతనం పెరుగుతుంది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన తాజా ఎస్‌బీఐ (SBI) పీఓ నియామక నోటిఫికేషన్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I ప్రారంభ బేసిక్ పే రూ.48,480గా పేర్కొంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్, ఎన్‌పీఎస్, మెడికల్, లీవ్ ట్రావెల్, లీజ్ రెంటల్ వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ముంబై కేంద్రంగా ప్రారంభ స్థాయి వార్షిక వేతనం (CTC) సుమారు రూ.20.43 లక్షలుగా పేర్కొంది. ఇందులో బ్యాంకు చెల్లించే వివిధ ప్రయోజనాలు, వసతి/లీజ్ సదుపాయాలు, రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్లు తదితరాలు కూడా ఉండొచ్చు.
ప్రైవేట్ బ్యాంకుల్లో లెక్క వేరే..
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పే స్కేల్ ఉండదు. ఉద్యోగి నిర్వహించే పాత్ర, నగరం, అనుభవం, బ్యాంకు, విక్రయ లక్ష్యాలు, పనితీరు ఆధారంగా ప్యాకేజీ మారుతుంది.
కస్టమర్ సర్వీస్, బ్రాంచ్ ఆపరేషన్స్ వంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నుంచి రిలేషన్‌షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, బ్రాంచ్ మేనేజర్ వంటి స్థాయిలకు వెళ్లే కొద్దీ వేతనంలో గణనీయమైన తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 2026లో ఇండీడ్ డేటా ప్రకారం భారతదేశంలో బ్రాంచ్ మేనేజర్ సగటు బేసిక్ జీతం నెలకు సుమారు రూ.27,581గా ఉంది. నగరం, సంస్థ, అనుభవాన్ని బట్టి ఈ మొత్తం గణనీయంగా మారుతోంది. క్రెడిట్ అనలిస్ట్ వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు సుమారు రూ.9 లక్షల వార్షిక సగటు బేసిక్ పే ఉంటోంది.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో భారీ ప్యాకేజీలు?
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సాధారణ రిటైల్ బ్యాంకింగ్ ఉద్యోగంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన విభాగం. కార్పొరేట్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్లు వంటి ప్రత్యేక కార్యకలాపాల్లో పనిచేసే వారికి అనుభవం, సంస్థ, బాధ్యతను బట్టి అధిక వేతనాలు లభించవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో బోనస్ కూడా మొత్తం పరిహారంలో పెద్ద భాగంగా ఉండొచ్చు.
అనుభవం పెరిగేకొద్దీ జీతం పెరుగుదల
బ్యాంకింగ్‌లో కెరీర్ ప్రారంభ దశలో జీతం కంటే ఉద్యోగి పనిచేసే కేడర్, ప్రమోషన్లు, ప్రత్యేక నైపుణ్యాలు, బాధ్యతల విస్తృతి కీలకంగా మారతాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ నుంచి ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగే కొద్దీ నిర్దిష్ట పే స్కేల్, ఇంక్రిమెంట్లు, అలవెన్సులు పెరుగుతాయి. ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లో మాత్రం ప్రమోషన్‌తో పాటు పనితీరు ఆధారిత వేరియబుల్ పే, బోనస్, సంస్థ మార్పు ద్వారా ప్యాకేజీలో పెద్ద మార్పులు రావచ్చు.
ఇదీ చదవండి: సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!!


