అక్టోబర్ 2న ‘జైల్ భరో’కు సీజేపీ నేత అభిజీత్ దీప్కే పిలుపు! | Abhijeet Dipke announces Jail Bharo Andolan in Mumbai on October 2 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2న ‘జైల్ భరో’కు సీజేపీ నేత అభిజీత్ దీప్కే పిలుపు!

Sep 28 2026 1:36 PM | Updated on Sep 28 2026 1:36 PM

Abhijeet Dipke announces Jail Bharo Andolan in Mumbai on October 2

ముంబై: ముంబైలో అక్టోబర్ 2న నిర్వహించాలనుకున్న నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘జైల్ భరో ఆందోళన’కు పిలుపునిచ్చారు. శివాజీ పార్క్‌లో నిరసనకు అనుమతి ఇవ్వలేమని ముంబై పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న శివాజీ పార్క్‌లో నిరసన చేపట్టాలని సీజేపీ నిర్ణయించింది. అయితే అక్కడ సభ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని ముంబై పోలీసులు తెలిపారు. బాంబే హైకోర్టు తీర్పు, అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు.

శివాజీ పార్క్‌లో భారీగా ప్రజలు గుమిగూడితే శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిరసన కోసం ముంబైలోని మరో ప్రాంతాన్ని ఎంచుకుని అనుమతి కోరాలని నిర్వాహకులకు సూచించారు. అనుమతి నిరాకరణపై దీప్కే స్పందిస్తూ.. పౌరుల గొంతుకను అణచివేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదని గతంలో పేర్కొన్నారు. తాజాగా అక్టోబర్ 2న ముంబైలో ‘జైల్ భరో ఆందోళన’ నిర్వహిస్తామని ఎక్స్‌లో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఓటర్ల జాబితాలపై చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)ను నిలిపివేయాలని, ఎన్నికల సంఘానికి సంబంధించిన చట్టపరమైన వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతోంది. ఎన్నికల జాబితాల నిర్ణయాలు, సర్‌ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం తన పనితీరులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. సంస్థలో అభిప్రాయ భేదాలు ఉండటం సాధారణమేనని, కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని తెలిపింది.

ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement