పెళ్లయిన కొద్ది నెలలకే పూణేకు చెందిన 23 ఏళ్ల ఐటీ ఇంజనీర్ వైష్ణవి ప్రవీణ్ జరండే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ఆమె భర్త, అత్తమామలపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. భారీగా కట్నం ఇచ్చినప్పటికీ కారు కావాలని వేధింపులకు గురి చేయడం వల్లనే తమ బిడ్డచనిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఏడాది మే 9న వైష్ణవికి, ఓంకర్ సంజయ్ ఘిసారే అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ పెళ్లిలో దాదాపు రూ. 45 లక్షలు ఖర్చు చేసిందని, 10 తులాల బంగారం ఇచ్చామని వైష్ణవి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ, కారు కొనుగోలు చేయడం కోసం అదనంగా రూ. 5 లక్షలు తెవాలంటూ ఆమె భర్త, అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు.
సెప్టెంబర్ 24 రాత్రి వైష్ణవి తన తల్లికి ఫోన్ చేసి తనను వేధిస్తున్నారు చెబుతూ బోరున విలపించింది. అదే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆమె భర్త కూడా వైష్ణవి పుట్టింటివారికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత వైష్ణవితో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె స్పందించకపోవడంతో, తల్లిదండ్రులు హుటాహుటినా పూణేకు బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాతే తమ కుమార్తె మృతి చెందినట్లు వారికి తెలిసింది.
వైష్ణవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త ఓంకర్ సంజయ్ ఘిసారే, ఆయన తల్లిదండ్రులపై కట్న నిషేధ చట్టం (Dowry Prohibition Act),ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


