తానా ప్రపంచసాహిత్య వేదిక 96వ సమావేశం విజయవంతం | Tana World Literature Forum 96th Meeting Grand Success | Sakshi
Sakshi News home page

తానా ప్రపంచసాహిత్య వేదిక 96వ సమావేశం విజయవంతం

Sep 28 2026 10:29 AM | Updated on Sep 28 2026 10:29 AM

Tana World Literature Forum 96th Meeting Grand Success

‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరేళ్లకు  పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (9 సెప్టెంబర్) ని పురస్కరించుకుని తెలంగాణా రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తానా ప్రపంచసాహిత్య వేదిక ఆదివారం జరిపిన 96వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర శాసనమండలి సభ్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, విశిష్ట రచయిత, ప్రజాకవి, వాగ్గేయకారుడు డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ “తెలుగు భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, భాష పరిరక్షణపట్ల ప్రజలలో అవగాహన ఆవసరం అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, కార్యకలాపాలు తెలుగులో ఉండేటట్లు చూడాలని, ప్రాధమిక స్థాయిలో మాతృభాషను నిర్భందంగా ప్రవేశపెట్టాలని కోరారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తన ప్రసంగంలో “ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ తన జీవితం అంతా సామాన్య ప్రజల మధ్యే గడుపుతూ, అనునిత్యం ప్రజాహక్కుల కోసం, తెలుగుభాష పరిరక్షణ కోసం పాటుబడ్డ భాషాభిమాని అని, కేవలం ఆయన జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకుని, ఒక సాహిత్య పురస్కారం అందజేసి చేతులు దులుపుకోకుండా, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.”

విశిష్టఅతిథులుగా పాల్గొన్న తెలంగాణా తెలుగు అకాడమీ ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ, బాల సాహితీవేత్త డా. సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తల్లి అంటే ఎంత ప్రేమో, తల్లి భాషను కాపాడుకోవడంలోను అంత శ్రద్ధ ఉండాలని, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా కలిసికట్టుగా భాషను కాపాడుకోవాలని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలను చేపట్టకపోతే తెలుగునేలమీద తెలుగుభాష అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగువిభాగంలో సహాచార్యురాలిగా పనిచేస్తున్న డా. ఎం. దేవేంద్ర కాళోజీ కలంనుండి వెలువడ్డ కొన్ని ముఖమైన కధలను సంక్షిప్తంగా పరిచయంచేసి ఆయన రచనా నైపుణ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.                

కార్యక్రమం చివరిలో కాలిఫోర్నియాలో నివసిస్తున్న రచయిత వెంకట్ నాగం రచించిన, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముందు మాటలు వ్రాసిన “కలగూరగంప”, “రచ్చబండ చర్చలు” అనే రెండు గ్రంధాలను డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో రచయిత వెంకట్ తో పాటు ఆయన భార్య వాణి, మిత్రులు డా. సురేంద్ర దార, వేణు నక్షత్రం, తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీకాంత్ గోడే లు పాల్గొని రచయిత వెంకట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: 9/11 అమరులకు నివాళిగా ‘గ్రాడ’ మెగా రక్తదాన శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement