త్రిశూర్: కేరళలోని త్రిశూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రెడ్, జామ్ తిన్న 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. ఆయన ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే మృతికి అసలు కారణం పోస్టుమార్టం తర్వాతే నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు. పళయన్నూర్‌లోని వడక్కెతర ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ (60), ఆయన కుమార్తెలు విద్య, వృంద శనివారం రాత్రి ఇంట్లో బ్రెడ్, జామ్ తిన్నారు. కొంతసేపటి తర్వాత ముగ్గురికీ అస్వస్థతతో పాటు వాంతులు ప్రారంభమయ్యాయి.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
వినోద్ పరిస్థితి విషమించడంతో ఒట్టపాలంలోని వల్లువనాడ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వార్డు సభ్యురాలు గీతా ఉన్నికృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ నాలుగు బ్రెడ్ ముక్కలు తిన్నారు. పెద్ద కుమార్తె విద్య రెండు ముక్కలు, చిన్న కుమార్తె వృంద ఒక ముక్కలో కొంత భాగం తిన్నారు.
కుమార్తెల పరిస్థితి ఇలా..
వినోద్ కుమార్తెలు విద్య, వృంద కూడా అస్వస్థతకు గురయ్యారు. విద్య ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. వృందను చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. వినోద్ భార్య సునీత, 16 ఏళ్ల కుమారుడు వివేక్ మాత్రం బ్రెడ్, జామ్ తినలేదు. వినోద్ మృతిపై పళయన్నూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 194 కింద అసహజ మరణంగా కేసు నమోదైంది. మృతదేహానికి పంచనామా ప్రక్రియ పూర్తిచేసి, త్రిశూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ‘సాగర్ ప్యారడైజ్’: 16 సెకన్లలో 14 సార్లు ఇనుప రాడ్‌తో దాడి


