డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ క్లబ్‌లో జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారిగా పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం డెట్రాయిట్‌లో ఆదివారం ఉదయం సుమారు 7.21 గంటలకు ఈ ఘటన జరిగింది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఈటన్ అవెన్యూ, ప్రెస్ట్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు ముందు ఘటన జరిగిన ప్రదేశంలో గొడవ జరిగినట్లు డెట్రాయిట్ పోలీస్ చీఫ్ టాడ్ బెట్టిసన్ తెలిపారు. గొడవ అనంతరం కొందరు తుపాకీతో హింసకు పాల్పడ్డారని చెప్పారు. అయితే అసలు గొడవ ఎందుకు మొదలైంది? కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు, సమాచారం లభించాయని బెట్టిసన్ తెలిపారు. అయితే దర్యాప్తు దృష్ట్యా వాటిని బహిర్గతం చేయలేదు. అనుమానితుడి వివరాలు లేదా అతడి రూపురేఖలను కూడా పోలీసులు వెల్లడించలేదు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది. డెట్రాయిట్ మేయర్ మేరీ షెఫీల్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ, దీనికి సంబంధించిన సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ ఘటనతో ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని డెట్రాయిట్ పోలీస్ విభాగం తెలియజేసింది.
ఇదీ చదవండి: సల్ఫర్ ధర డబుల్.. భారత్‌కు సరికొత్త సంక్షోభం!


