‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ | PM Narendra Modi Mann ki Baat speech many important topics | Sakshi
Sakshi News home page

‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

Sep 27 2026 11:55 AM | Updated on Sep 27 2026 12:18 PM

PM Narendra Modi Mann ki Baat speech many important topics

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను గుర్తుచేసుకుంటూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన, మాజీ వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ సేవలు, గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవాలయ చరిత్ర, సుందర్‌బన్‌లో మహిళల జీవనోపాధి వంటి అంశాలపై మాట్లాడారు.

సర్జికల్ స్ట్రైక్‌కు పదేళ్లు
2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం నియంత్రణ రేఖ (LoC) దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదంపై భారత సైనికుల చర్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్
బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు భారత్ తన వైఖరిని పదేపదే స్పష్టం చేసిందని మోదీ అన్నారు. భారత్‌పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నిస్తే గట్టి సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతోందని తెలిపారు.

జనగణనపై ప్రధాని సందేశం
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనగణన తొలి దశ దాదాపు పూర్తయిందని మోదీ చెప్పారు. ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మాణా గ్రామం నుంచి జనగణన ప్రారంభమైందని, జనగణన ప్రతి ఒక్కరి జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.

అశోక్ సింఘాల్‌కు నివాళి
విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ సింఘాల్ 100వ జయంతిని కూడా మోదీ గుర్తుచేశారు. సంస్కృతి, సమాజం, దేశం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రామజన్మభూమి ఉద్యమానికి సింఘాల్ అందించిన దిశ, శక్తిని మోదీ ప్రస్తావించారు.

మోఢేరా సూర్య దేవాలయానికి వెయ్యేళ్లు
1026లో గజనీ సోమనాథ ఆలయంపై దాడి చేసిన సమయంలోనే గుజరాత్‌లోని మోఢేరా సూర్య దేవాలయంపై కూడా దాడి జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం రాజా భీమదేవుడి కాలంలో 1025లో జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం మోఢేరా దేశంలో తొలి సౌర గ్రామంగా కూడా గుర్తింపు పొందిందన్నారు.

మహిళలకు అండగా మాంగ్రూవ్ అడవులు
సుందర్‌బన్‌లోని ఝార్ఖాలీ ప్రాంత మహిళలు మాంగ్రూవ్ అడవులను అభివృద్ధి చేస్తున్నారని మోదీ చెప్పారు. వీరిలో పలువురు పులుల దాడుల్లో భర్తలను కోల్పోయిన మహిళలు ఉన్నారని తెలిపారు. మాంగ్రూవ్ మొక్కలు గ్రామాలకు సహజ రక్షణ కవచంగా మారడంతో పాటు, వాటి ద్వారా మహిళలకు ఆదాయం కూడా లభిస్తోందని వివరించారు.

ఇదీ చదవండి: నోయిడా నిరసనలు: చదువులు, ఉద్యోగాలకు దూరమైన ‘జెన్‌ జీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement