పూణే: మహారాష్ట్రలోని పుణేలో మాజీ వైద్యాధికారి డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్‌పై దాడి, బెదిరింపుల కేసులో ‘బిగ్‌బాస్ మరాఠీ’ నటి, రీల్ స్టార్ దివ్యా షిండేపై ఫిర్యాదు నమోదైంది. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను బెదిరించారని, అనంతరం 10 మంది తన ఇంట్లోకి చొరబడి దాడి చేశారని వైద్యుడు ఆరోపించారు. పుణే కంటోన్మెంట్ బోర్డు మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్ ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు నుంచి కొందరు వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17న దివ్యా షిండే కొందరితో కలిసి తన ఇంటికి వచ్చిందని గైక్వాడ్ ఆరోపించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న తనను ఓ హోటల్‌కు పిలిపించి మరోసారి డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి గూండాలను పంపి కొడతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 24 రాత్రి దివ్యా షిండేతో పాటు 10 మంది బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించారని వైద్యుడు ఆరోపించారు. అనంతరం తనపై దాడి చేశారని తెలిపారు. ముఖం, పొట్ట, వీపుపై పిడిగుద్దులు కొడుతూ, కాళ్లతో తన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడి సమయంలో పదునైన ఆయుధాలు, కర్రలు, బెల్టులు, ఇనుప వస్తువులను కూడా ఉపయోగించారని గైక్వాడ్ ఆరోపించారు. తాను పక్షవాతంతో బాధపడుతున్నానని చెప్పి, వదిలేయాలని వేడుకున్నప్పటికీ దాడి ఆపలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయం కాగా కుట్లు వేయాల్సి వచ్చిందని సమాచారం. వైద్యుడిపై దాడి చేసిన అనంతరం ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని, రూ.5 లక్షలు వసూలు చేయడంలో విఫలమైన తర్వాత ఆయన కారును తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్యా షిండే, అన్నా ధమ్ధేరేతో పాటు మరో ఏడుగురిపై కాలేపాడల్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దివ్యా షిండే ఈ ఏడాది ‘బిగ్‌బాస్ మరాఠీ 6’లో పాల్గొన్నారు. రెల్స్ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది.
ఇదీ చదవండి: అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక!


