సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పీసీసీ చేపట్టింది. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు పేర్లతో పీసీసీ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాను పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపినట్లు తెలుస్తోంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా.. అభ్యర్థి ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. అదే విధంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థి ఎంపిక బాధ్యతను మంత్రి దామోదర్ రాజనర్సింహకు అప్పగించినట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కలిపి సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా మూడు స్థానాల పదవీకాలాలు నవంబర్‌లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎలాంటి సామాజిక సమీకరణాలు ఉండాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సెప్టెంబర్ 29న ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించి అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఓటర్ల జాబితా పునఃసిద్ధీకరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. దీంతో అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: అక్టోబర్ 4న తెలంగాణకు అమిత్‌షా


