మీ గుండె వయసు తెలుసా? | Aging occurs at different levels in the body | Sakshi
Sakshi News home page

మీ గుండె వయసు తెలుసా?

Sep 27 2026 5:08 AM | Updated on Sep 27 2026 5:08 AM

Aging occurs at different levels in the body

శరీరంలో వేర్వేరు స్థాయిల్లో నమోదవుతున్న వృద్ధాప్యం

50 ఏళ్లు దాటిన ప్రతి ఐదుగురికిగాను ఒకరిలో వేగంగా క్షీణిస్తున్న ఏదో ఒక అవయవం

రక్త పరీక్ష ద్వారా అవయవాల బయోలాజికల్‌ ఏజ్‌ గుర్తిస్తున్న శాస్త్రవేత్తలు

వృద్ధాప్య నియంత్రణపై ఆసక్తి రేపుతున్న సరికొత్త వైద్య పరిశోధనలు

మీ వయసు ఎంత అని అడిగితే టక్కున చెప్పేస్తారు. కానీ మీ గుండె వయసు ఎంతో చెప్పగలరా? మీ మెదడుకు ఎన్నేళ్లో తెలుసా? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. మన జీవ వయసు­కు, శరీరంలోని అంతర్గత అవయవాల వయసుకు మధ్య తేడా ఉంటుంది. ఒక్కో అవయవం తనదైన ప్రత్యేక వేగంతో వృద్ధాప్యానికి గురవుతూ క్షీణిస్తుంటుంది. ఎందుకంటే.. వృద్ధాప్యం శరీరమంతా ఒకే తీరుగా సాగే ప్రక్రియ కాదని పరిశోధనలు చెబుతున్నాయి. 

శరీరంలోని వివిధ అవయవాలు వేర్వేరు వేగాలతో వృద్ధాప్యానికి లోనవుతాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన ఆరోగ్యకరమైన ప్రతి ఐదుగురికి­గాను ఒకరిలో కనీసం ఏదో ఒక అవయవం మిగతా శరీర అవయవాల కంటే వేగంగా క్షీణిస్తుంది. వృద్ధాప్యం స్థిరమైన వేగంతో కాకుండా ఒక్కో వ్యక్తికి 34, 60, 78 ఏళ్ల వయసులో మారుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రక్తంలోని ప్రొటీన్ల విశ్లేషణతో అవయవాల వయసు లెక్కింపు..
అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో కేవలం ఒక రక్త పరీక్ష సాయంతో శరీరంలోని 11 ముఖ్యమైన అవ­య­వాల జీవ సంబంధ వయసును కచ్చితంగా అంచనా వేయవచ్చని నిరూపించారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే వేలాది ప్రొటీన్లను విశ్లేషించడం ద్వారా నిర్దిష్ట అవయవాల నుంచి విడుద­లయ్యే ప్రొటీన్‌ గుర్తులను గుర్తించవచ్చని.. తద్వారా శరీరంలోని ఒక్కో అవయవ వయç­Üును కంప్యూటర్‌ ఆధారిత ఏజింగ్‌ క్లాక్స్‌ ద్వారా లెక్కించడం వీలవుతోందని పేర్కొన్నారు. అవయ­వాల్లోని కణాల పనితీరు తగ్గడం, డీఎన్‌ఏ దెబ్బతినడం వంటి ప్రక్రియల వల్ల శరీరంలో అవయవాల ఆరోగ్యం వేర్వేరు స్థాయిల్లో ఉంటోందన్నారు. 

ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన అనారోగ్య సమస్యలను 10–15 ఏళ్ల ముందే ఊహించి అందుకు తగ్గ చికిత్సలు చేయడం వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు ఒకరి మెదడు జీవసంబంధ వయసు వారి అసలు వయసు కంటే ఎక్కువగా ఉంటే వారికి మతిమరుపు వ్యాధి వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని వివరిస్తున్నారు. అలాగే గుండె జీవవయసు వేగంగా పెరిగితే భవిష్య­త్తులో హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు, గుండెపోట్ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూత్రపిండాల వయసు పెరిగిన కొద్దీ రక్తపోటు, మధుమేహం కాంప్లికేషన్లు పెరుగుతాయని వివరిస్తున్నారు.

దీర్ఘాయువుకు కీలక సూత్రాలు 
» రోజూ ఒక గ్రాము ఒమేగా–3, 2000 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌–డి తీసుకోవడం, వారానికి మూడుసార్లు బరువులెత్తే వ్యాయామం చేస్తుంటే వృద్ధాప్య వేగం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
»   ఏరోబిక్‌ వ్యాయామం మెదడుకు రక్తప్రసరణను పెంచి జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోకాంపస్‌ పరి­మా­ణాన్ని కాపాడుతుంది. కండరాల దృఢత్వం వృద్ధాప్యంలో వ్యక్తి స్వావలంబనకు తోడ్పడుతుంది. 
»  షింగిల్స్‌ టీకా తీసుకోవడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం 20 శాతం మేర తగ్గుతుందని తేలింది. 

క్షీణించే అవయవానికి చికిత్సే లక్ష్యం..
నిర్దిష్ట శారీరక స్థితి ఆధారంగానే అవయవ గడియారాల రీడింగ్స్‌ను అర్థం చేసుకోవాలి. వేగంగా క్షీణించే అవయవాన్ని ముందే గుర్తించి చికిత్స అందించటమే ప్రస్తుత లక్ష్యం. వయోభారాన్ని తగ్గించే ఔషధాలు వాడితే అవి రోగనిరోధక శక్తిని తగ్గించే అవకాశం ఉన్నందున వయోభారాన్ని తగ్గించే సహజ పద్ధతులను పాటించడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. – దీపక్‌ కుమార్‌ సైనీ, ఐఐఎస్‌సీ ప్రొఫెసర్, వృద్ధాప్య ప్రక్రియపై అధ్యయనం చేస్తున్న భారత్‌ ప్రాజెక్ట్‌ సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement