ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు | How Identical Twins Broke Aadhaar Biometric System How UIDAI Fixed It | Sakshi
Sakshi News home page

ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

Sep 25 2026 1:34 PM | Updated on Sep 25 2026 1:49 PM

How Identical Twins Broke Aadhaar Biometric System How UIDAI Fixed It

డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడికీ ‘ఆధార్’ ప్రాథమిక గుర్తింపుగా మారింది. వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ల ఆధారంగా డిజిటల్ సిస్టమ్ ప్రతి ఒక్కరినీ విడివిడిగా గుర్తిస్తుంది. అయితే, ప్రకృతి సృష్టించిన ఒక అరుదైన పోలిక ఆధార్‌కే సవాలుగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 10వ తరగతి కవలలు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ల విషయంలో నమోదైన ఘటన సాంకేతిక నిపుణులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది.

సమస్య ఎక్కడ వచ్చింది?

సాధారణంగా ఒకే రూపం ఉన్న కవలల్లో (ఐడెంటికల్‌ ట్విన్స్‌) సైతం వేలిముద్రలు లేదా కంటిపాప అమరికలో స్వల్ప తేడాలు ఉంటాయి. కానీ, రాంపూర్ కవలల విషయంలో వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు 100 శాతం ఒకేలా సరిపోలాయి. దీంతో పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తుండగా ఒకరి అప్‌డేట్ పూర్తవ్వగానే మరొకరి దరఖాస్తును యూఐటీఏఐ సిస్టమ్ డూప్లికేట్‌గా గుర్తిస్తూ తిరస్కరించింది. ఈ సమస్య మూలంగా విద్యార్థినుల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

పరిష్కారం లభించిందిలా..

బాధిత కుటుంబం రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం) అజయ్ కుమార్ ద్వివేదిని ఆశ్రయించింది. ఈ అరుదైన కేసును ప్రత్యేకమైనదిగా పరిగణించిన డీఎం వెంటనే స్పందించి యూఐటీఏఐ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం, లఖ్‌నవూ ప్రాంతీయ కార్యాలయాల అధికారులతో సమన్వయం చేశారు. సంస్థ సాంకేతిక విభాగం ఈ ఘటనను లోతుగా పరిశీలించి ప్రత్యేక సాంకేతిక నిబంధనలు, మాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు కృషి చేసి పాత రికార్డులను సరిదిద్ది ఇద్దరికీ వేర్వేరుగా ఆధార్ గుర్తింపులను కేటాయించింది.

సాంకేతిక పరిమితులు

అత్యాధునిక బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థలు అత్యధిక శాతం పక్కాగా పనిచేసినప్పటికీ ఇటువంటి అత్యంత అరుదైన మినహాయింపులు సాంకేతిక వ్యవస్థ పరిమితులను తెలియజేస్తున్నాయి. సమయానుకూలమైన అడ్మినిస్ట్రేటివ్ జోక్యంతో సాంకేతిక సమస్యను అధిగమించి కవలల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికార యంత్రాంగం పరిష్కారం చూపడం అభినందనీయమని కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement