ఆధార్‌ బయోమెట్రిక్‌ లేకుంటే గ్యాస్‌ సబ్సిడీ కట్‌ | Aadhaar Biometric Authentication Must For Subsidised LPG Refills From October | Sakshi
Sakshi News home page

ఆధార్‌ బయోమెట్రిక్‌ లేకుంటే గ్యాస్‌ సబ్సిడీ కట్‌

Sep 23 2026 6:10 AM | Updated on Sep 23 2026 6:10 AM

Aadhaar Biometric Authentication Must For Subsidised LPG Refills From October

వచ్చే నెల 1వతేదీ నుంచి 14.2 కేజీల సిలిండర్‌కు బ్రేక్‌ 

బీఏఏ పూర్తయ్యే వరకు 5, 10 కేజీల సిలిండర్లే.. 

అవీ మార్కెట్‌ ధరకు ఈనెల 14తో గడువు ముగిసినా బీఏఏకు అవకాశం   

సాక్షి, హైదరాబాద్‌: గ్యాస్‌ సిలిండర్‌ కావాలంటే ఇక ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ (బీఏఏ) పూర్తి చేయని కుటుంబాలకు అక్టోబర్‌ 1 నుంచి 14.2 కేజీల గృహ ఎల్‌పీజీ సిలిండర్‌ను సబ్సిడీతో అందించే విధానానికి కేంద్రం బ్రేక్‌ వేయనుంది. బీఏఏ పూర్తయ్యే వరకు 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉండదు. అయితే కనెక్షన్‌ రద్దు చేయడం, గ్యాస్‌ పూర్తిగా నిలిపివేయడం ఉండదు. అవసరమైతే 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్‌ ధరకు మాత్రమే కొనుగోలు చేయాలి. బీఏఏ పూర్తి చేసిన వెంటనే 14.2 కేజీల సబ్సిడీ రీఫిల్‌ సౌకర్యం పునరుద్ధరిస్తారు.  

బీఏఏ అంటే.. 
గ్యాస్‌ కనెక్షన్‌దారుడి ఆధార్‌ వివరాలను వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్‌ విధానంలో ధ్రువీకరించడమే బీఏఏ. అంటే గ్యాస్‌ కనెక్షన్‌ నిజమైన వినియోగదారుడిదేనని ఆధార్‌తో నిర్ధారించే ప్రక్రియ. బీఏఏ పూర్తి చేసేందుకు తొలుత జూన్‌ 30ను గడువుగా నిర్ణయించిన కేంద్రం.. ఆ తర్వాత పలుమార్లు పొడిగిస్తూ చివరకు ఈనెల 14 వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు ముగిసినా, బీఏఏ చేసుకునే అవకాశం పూర్తిగా మూసివేయలేదు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు బీఏఏ పూర్తి చేసుకోవచ్చు.

 ఇప్పటికే ధ్రువీకరణ పూర్తిచేసిన వారికి ఎలాంటి అదనపు ప్రక్రియ అవసరం లేదు. బీఏఏ పూర్తికాని వినియోగదారులకు వచ్చే నెల 1 నుంచి ప్రధానంగా ఇబ్బంది కలిగేది 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్‌ విషయంలోనే. బీఏఏ పూర్తయ్యే వరకు ఆ రీఫిల్‌ను నియంత్రిత ధరకు బుక్‌ చేసుకునే అవకాశం ఉండదు. గ్యాస్‌ అవసరం ఉన్నవారు ఆయిల్‌ కంపెనీల లభ్యతను బట్టి 5 లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్‌ ధరకు తీసుకోవచ్చు. వీటిపై సబ్సిడీ ఉండదు. 

తెలంగాణలో 88 శాతం పూర్తి 
తెలంగాణలో సుమారు 1.26 కోట్ల గృహ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. సెపె్టంబర్‌ 14 గడువు నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సుమారు 88 శాతం మంది బీఏఏ పూర్తి చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 19 నాటికి 27.43 కోట్ల మంది యాక్టివ్‌ గృహ ఎల్‌పీజీ వినియోగదారులు, అంటే 89.9 శాతం మంది బీఏఏ పూర్తి చేసినట్టు కేంద్రం వెల్లడించింది. గడువు సమీపించిన సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద బీఏఏ కోసం రద్దీ పెరిగింది. 

దీంతో గడువును కేంద్రం పలు దఫాలు పొడిగించింది. ప్రస్తుతం మిగిలిన వినియోగదారులు ఆలస్యం చేయకుండా ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. వినియోగదారులు సిలిండర్‌ డెలివరీ సమయంలోనే డెలివరీ సిబ్బంది ద్వారా, గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో లేదా సంబంధిత ఆయిల్‌ కంపెనీ మొబైల్‌ యాప్‌ ద్వారా బీఏఏ పూర్తి చేసుకోవచ్చు. ఇండేన్, భారత్‌గ్యాస్, హెచ్‌పీ గ్యాస్‌ సంస్థలు డిజిటల్‌ మార్గాలను అందుబాటులో ఉంచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement