కంటికి నచ్చితేనే కడుపులోకి.. | Interesting study by National Nutrition Institute on the eating habits of youth | Sakshi
Sakshi News home page

కంటికి నచ్చితేనే కడుపులోకి..

Sep 23 2026 6:01 AM | Updated on Sep 23 2026 6:01 AM

Interesting study by National Nutrition Institute on the eating habits of youth

అందంగా అలంకరిస్తే ఆరోగ్యకర ఆహారాలు తినేందుకూ టీనేజర్ల ఆసక్తి 

యువత ఆహార అలవాట్లపై జాతీయ పోషకాహార సంస్థ ఆసక్తికర అధ్యయనం 

దీనివల్ల చిరుధాన్యాలు, పండ్ల వాడకం పెరుగుతుందని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: పిజ్జాలు, బర్గ ర్లు, ఐస్‌క్రీంల వంటి జంక్‌ ఫుడ్‌ తినడం అనారోగ్యకరమైనప్పటికీ వాటి ఫొటోలు చూడగానే మనలో చాలా మందికి నోరూరడం సహజమే. అయితే ఇదే వ్యూహాన్ని ఉపయోగించి టీనేజర్లను ఆరోగ్యకర ఆహారాల వైపు మళ్లించవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తాజా పరిశోధన ద్వారా నిరూపించింది. అనారోగ్యకర జంక్‌ ఫుడ్‌ను ఆకర్షణీయంగా చూపించినట్లే పండ్లు, చిరుధాన్యాల వంటి పోషకాహారాలకు ఈ పద్ధతిని వర్తింపజేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అధ్యయనం ద్వారా విశ్లేషించింది. 

పరిశోధన సాగిందిలా.. 
ఈ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు ఆరోగ్యకర, అనారోగ్యకర ఆహార పదార్థాలకు సంబంధించిన 150 చిత్రాలను సేకరించారు. వాటిని మొదట కొందరు పాఠశాల విద్యార్థులకు చూపించి వారి ఇష్టాయిష్టాల ఆధారంగా 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఇందులో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన అనారోగ్యకర ఆహారాలతోపాటు రంగురంగుల్లో ఆకర్షణీయంగా అలంకరించిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు, గింజలు, సాధారణంగా ప్లేట్లలో ఉంచిన పోషకాహారాలు ఉన్నాయి. అనంతరం ఈ మొత్తం ఫొటోలను 15 రోజులపాటు 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న టీనేజర్లకు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పంపారు. వారిలో కొందరికి ఆయా ఫొటోలతోపాటు సంక్షిప్త పోషక విలువల సమాచారాన్ని అందించగా మరికొందరికి కేవలం ఫొటోలనే పంపించారు. అనంతరం వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 

కళ్లు చెదిరే ఫలితాలు.. 
ఈ పరిశోధనలో ఆహారం కనిపించే విధానానికి, దానిని తినడానికి యువత చూపే ఆసక్తికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది. సాధారణంగా వడ్డించిన ఆహార ఫొటోలతో పోలిస్తే ఆకర్షణీయంగా అలంకరించి చూపించిన చిరుధాన్యాల జావ, శనగల సలాడ్‌ వంటి ఫొటోలు టీనేజర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. వాటిని తినడానికి వారు ఎంతో సుముఖత వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం ఇష్టపడటమే కాకుండా చాలా మంది యువతీయువకులు అంతకుముందు తమకు నచ్చని పండ్లు, పప్పుధాన్యాలను తినడం ప్రారంభించారని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

కొందరు యువత తమ ఇళ్లలోనూ ఆహారాన్ని వినూత్నంగా వండటం, అందంగా ప్లేట్లలో అమర్చడం వంటి ప్రయోగాలు చేయడం విశేషం. పరిశోధనలో పాల్గొన్న యువత తమ అభిప్రాయాలను పంచుకుంటూ చిత్రాలలోని రంగులు, ఆహార ఆకృతి, ప్రకాశం, అమరిక, సమతుల్యత వంటి అంశాలు తమను ఆకర్షించాయని చెప్పారు. ఆహారాన్ని ప్రదర్శించే విధానం అది తినే వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్బారావు వివరించారు. సాధారణంగా చూపించే పౌష్టికాహారాన్ని ఇంటి భోజనంగా భావించే యువత.. అదే ఆహారాన్ని ఆకర్షణీయంగా అలంకరిస్తే హోటళ్లు, లేదా స్నేహితులతో కలిసి విందులకు వెళ్లినప్పుడు తినడానికి ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

చిత్రాలకే ప్రాధాన్యం.. 
చిత్రాలతో పాటు పోషక విలువల సమాచారాన్ని రాసినప్పటికీ యువత ఆ రాతపూర్వక సమాచారం కంటే చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డిజిటల్‌ మాధ్యమాలలో ఫొటోలతో సమాచార మార్పిడి ఎంత శక్తివంతమైనదో ఇది నిరూపిస్తోంది. ఈ ఫలితాలను సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా పాఠశాల క్యాంటీన్లు, హోటళ్లలో పోషకాహార ప్రచార వ్యూహంగా ఉపయోగించవచ్చని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement