8,283 కేంద్రాలు.. 65 లక్షల టన్నుల వడ్ల సేకరణ లక్ష్యం
బోనస్‌కు ‘అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ’తప్పనిసరి
గోదాములు, హమాలీలు, రవాణాపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ మొదటివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సీజన్‌లో 8,283 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, క్లీనర్లు, ఆరబెట్టే యంత్రాలు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి మిల్లులకు తరలింపు వరకు ఎక్కడా ఇబ్బంది రాకుండా స్టోరేజ్–హమాలీ–ట్రాన్స్‌పోర్ట్ (ఎస్‌హెచ్‌టీ) వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
ఫార్మర్ ఐడీ ఉంటేనే....
సన్నరకం ధాన్యం పండించే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించనున్నారు. అయితే బోనస్ పొందేందుకు రైతులకు ‘అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ’తప్పనిసరి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతుల ఖాతాల్లో బోనస్ నేరుగా జమ చేస్తారు. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 7715 రకం ధాన్యం పండించిన రైతులకే ప్రభుత్వం బోనస్ అందజేయనుంది.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తరలించేలా గోదాములను సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే వినియోగంలో లేని రైస్‌మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాలను కూడా నిల్వకు ఉపయోగించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలను ఎక్కించేందుకు, దించేందుకు సరిపడా హమాలీలతోపాటు రవాణా వాహనాలను కూడా సిద్ధం చేయనున్నారు.
ప్రతి మిల్లుపై నిఘా
ధాన్యం మిల్లింగ్ దశలో అక్రమాలకు తావులేకుండా ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) మొబైల్ యాప్‌ను ఉపయోగించనున్నారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా రైస్ మిల్లుల్లో ప్రతివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ధాన్యం నిల్వలు, రికార్డులు, మిల్లింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను నమోదు చేయనున్నారు. తప్పుడు రికార్డులు సృష్టించడం, లెక్కల్లో తేడాలు చూపించడం, ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడడం వంటి వాటిని తీవ్రంగా పరిగణించనున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ, మిల్లింగ్ దశలోనూ అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. తప్పుడు రికార్డులు సృష్టించినా, లెక్కల్లో మోసాలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ధాన్యం తరలింపులో పారదర్శకతకు ప్రతి రవాణా వాహనానికి జీపీఎస్ ఆధారిత వాహన లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (వీఎల్‌టీఎస్) తప్పనిసరి చేశారు.
జిల్లాల వారీగా సమీక్ష
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల పౌర సరఫరాల అధికారులు, మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 8,283 కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, రవాణా వాహనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


