సెల్లార్లలో 'సిరులు'! | Mining mafia is extracting crores of rupees through excavations | Sakshi
Sakshi News home page

సెల్లార్లలో 'సిరులు'!

Sep 23 2026 1:36 AM | Updated on Sep 23 2026 1:36 AM

Mining mafia is extracting crores of rupees through excavations

బేగంపేట కుందన్‌బాగ్‌ పార్కు రోడ్డులోని ఓ సెల్లార్‌ గుంతలో భారీ ఎక్సకవేటర్లతో తవ్వకాలు సాగిస్తున్న దృశ్యం

తవ్వకాలతో ‘రూ. కోట్లు’ వెలికితీస్తున్న మైనింగ్‌ మాఫియా

భవన నిర్మాణ ప్రదేశం నుంచి మట్టి, బండరాళ్లు అక్రమంగా తరలింపు 

రాయల్టీ, సీనరేజీ కింద రూ.కోట్లు ఎగవేసి... జేబులు నింపుకుంటున్న వైనం 

కొన్నిచోట్ల మైనింగ్‌ అనుమతులు లేకుండానే భారీగా సెల్లార్ల తవ్వకాలు 

హైదరాబాద్‌తో పాటు శివార్లలో పెద్దసంఖ్యలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం 

సెల్లార్ల కోసం తవ్విన మైనర్‌ మినరల్స్‌ అక్రమ క్రషర్లకు రవాణా... రాజకీయ అండ, అధికారుల నిఘా లోపం, కుమ్మక్కుతో యథేచ్ఛగా దందా 

కొన్నిచోట్ల నోటీసులిచ్చి, జరిమానాలు విధించినా పట్టించుకోని మాఫియా

11,820 చదరపు మీటర్ల మట్టి, బండరాళ్ల అమ్మకం 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టి అన్నారం గ్రామంలోని సర్వే నంబర్‌ 121/పీలో నమిశ్రీ ప్రాజెక్ట్స్‌ నిర్మాణ పనులపై గనుల శాఖ 2024 నవంబర్‌లో నోటీసు జారీ చేసింది. అధికారుల తనిఖీలో సెల్లార్‌ తవ్వకం దాదాపు పూర్తయినట్లు, సుమారు 11,820 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మట్టి, బండరాళ్లను తవ్వి అక్రమంగా అమ్మేసుకున్నట్లు బయటపడింది. దీంతో సాధారణ సీనరేజ్‌ ఫీజు, పది రెట్ల జరిమానా, డీఎంఎఫ్, ఎస్‌ఎంఈటీ, ఇతర రుసుములతో కలిపి రూ.3.39 కోట్లు చెల్లించాలని గనుల శాఖ డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. కానీ ఆ సంస్థ జరిమానా చెల్లించలేదు. దీంతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామని మైనింగ్‌ శాఖ ప్రకటించినా అందులో పురోగతి లేదు.

కల్వల మల్లికార్జున్‌రెడ్డి 
హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం తవ్వుతున్న సెల్లార్‌ గుంతల నుంచి మైనింగ్‌ మాఫియా ‘రూ.కోట్లు’ వెలికితీస్తోంది. సెల్లార్‌ తవ్వకంలో వెలువడే మైనర్‌ మినరల్స్‌ను (మట్టి, బండరాళ్లు తదితరాలు) అక్రమంగా తరలిస్తూ భారీయెత్తున సొమ్ము చేసుకుంటోంది. మైనర్‌ మినరల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమాలు కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రాయల్టీ, సీనరేజీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ (పర్యావరణ ప్రభావం) ఫీజు తదితరాలను ఎగవేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. గనుల శాఖ షోకాజ్‌ నోటీసులను కూడా మైనింగ్‌ మాఫియా బేఖాతరు చేస్తుండగా, కొన్నిచోట్ల అనుమతులు లేకుండానే సెల్లార్‌ తవ్వకాలు సాగిస్తోంది. కొన్నిచోట్ల సెల్లార్‌ నిర్మాణాల పేరిట అక్రమ మైనింగ్, రవాణా విచ్చలవిడిగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణలున్నాయి. చాలాచోట్ల బిల్డర్లు భవన నిర్మాణ అనుమతి మాత్రమే తీసుకుని, మైనింగ్‌ అనుమతులు లేకుండా భారీగా తవ్వి టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి ఉన్నా పరిమాణానికి మించి తవ్వి, ఓవర్‌లోడ్‌తో రవాణా చేస్తున్నారు. ఉల్లంఘన జరిగితే సాధారణ సీనరేజ్‌కు పది రెట్లు పెనాల్టీ విధించాలని నిబంధనలున్నా అరుదుగా మాత్రమే ఇది అమలవుతోంది. రాజకీయ అండ, గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం, అక్రమార్కులతో కొందరు అధికారులు చేతులు కలపడంతో మైనింగ్‌ మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఖనిజ నిర్వహణ, రవాణాను పర్యవేక్షించాల్సిన మైనింగ్‌ విభాగం.. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ చేతులెత్తేస్తోంది.  

పర్యవేక్షణ లేదు..తనిఖీల్లేవు 
భవన నిర్మాణ ప్రదేశాలను గనుల శాఖ అధికారులు తనిఖీ చేసి సెల్లార్‌ లేదా బేస్‌మెంట్‌ కోసం తవ్విన పరిమాణాన్ని లెక్కించాలి, ఒకవేళ నిర్మాణ ప్రదేశం నుంచి బయటకు తరలిస్తే ఆ పరిమాణాన్ని లెక్కించి సీనరేజీ ఫీజు వసూలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సీనరేజీ ఫీజుతో పాటు జరిమానా విధిచవచ్చు. చట్టబద్ద అనుమతి లేకుండా తవ్విన, రవాణా చేసిన ఖనిజాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ..ఆమోదిత భవన ప్రణాళికలో సెల్లార్‌ ఉందా, ఒకవేళ ఉంటే ఎంత విస్తీర్ణం, ఎంత లోతు వరకు అనుమతులు ఉన్నాయి, నిర్మాణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయా? అని పర్యవేక్షించే యంత్రాంగం లేకుండా పోయింది. దీంతో సెల్లార్‌ తవ్వకాల్లో బయట పడే మట్టి, రఫ్‌స్టోన్, బిల్డింగ్‌ స్టోన్‌ వంటి మైనర్‌ మినరల్స్‌ పరిణామానికి లెక్కే లేకుండా పోతోంది. వెలికి తీసిన మట్టి, రఫ్‌స్టోన్, బిల్డింగ్‌ స్టోన్‌ను అదే ప్రాంగణంలో ఉపయోగించారా లేక అక్రమంగా బయటకు తరలించారా అని తనిఖీలు చేసే వారే కరువయ్యారు. నిర్మాణ ప్రదేశం నుంచి తరలించే ఖనిజానికి చట్టబద్ద అనుమతులు ఉన్నాయా, సీనరేజీ ఫీజు చెల్లించారా, రవాణా అనుమతులు ఉన్నాయా అని పర్యవేక్షించే యంత్రాంగం కనిపించడం లేదు. 

సమన్వయ లోపమూ వరమే.. 
గనులు, రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య సమన్వయం, సమాచార మారి్పడి లేకపోవడం మైనింగ్‌ మాఫియాకు వరంగా మారింది. భవన నిర్మాణాలు, సెల్లార్‌ తవ్వకాల అనుమతులను గనుల శాఖతో సంధానించేలా సమగ్ర ఆన్‌లైన్‌ విధానం రూపొందించి జియో ట్యాగింగ్, జీపీఆర్‌ఎస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని 2024లోనే నిర్ణయించినా నేటికీ ఆ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.  
మరికొన్ని అక్రమాలు.. 
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలంలో రైచందానీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ 1600 చదరపు మీట్ల విస్తీర్ణంలో సెల్లార్‌ గుంతను తవ్వింది. అనుమతులు, పర్యావరణ ప్రభావ రుసుము చెల్లించినా తవ్వి తీసిన 7,200 మెట్రిక్‌ టన్నుల మట్టికి సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. 
⇒ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మన్సూరాబాద్‌ ప్రాంతంలోని ఆటోనగర్‌ పార్కింగ్‌ ఏరియా, ఇంద్రానగర్‌ కాలనీ, విజయశ్రీ కాలనీ తదితర చోట్ల నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెల్లార్‌ తవ్వకాలపై ఫిర్యాదులు అందడంతో గనుల శాఖ మట్టి అక్రమ రవాణాపై నోటీసులు జారీ చేసింది. తవ్వకాలు, రవాణా అడ్డుకోవాలని పోలీసులు, స్థానిక తహశీల్దార్లకు లేఖలు రాసి చేతులు దులుపుకుంది. 
⇒ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌లో రుబ్రిక్‌ ఎస్టేట్స్‌కు గ్రావెల్‌ తవ్వకం, రవాణాకు సంబంధించి గనుల శాఖ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. 2025 అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు 10 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వుకోవచ్చని పేర్కొంది. అదే ఏడాది అక్టోబర్‌ 23న తనిఖీ చేసిన అధికారులు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో తవ్వకాలు, రవాణా నిలిపివేయాలని తహసీల్దార్, పోలీసులకు సూచించారు. కానీ చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
⇒ నగరం నడిరోడ్డున ఉన్న బేగంపేట కుందన్‌బాగ్‌ పార్కు రోడ్డులోని విశాలమైన ప్రదేశంలో భారీ సెల్లార్‌ గుంత కాసుల వర్షం కురిపిస్తోంది. రాత్రి వేళలో భారీ ఎక్సకవేటర్లతో తవ్వకాలు సాగిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ వ్యాపారులతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని దందా సాగుతోంది. ఎక్స్‌కవేటర్‌ ద్వారా మట్టి నింపేందుకు చాప మొరంకు రూ.200, స్టాక్‌ మొరంకు రూ.500, సెల్లార్‌ కటింగ్‌ మొరంకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 కోట్ల మట్టి అక్రమంగా సెల్లార్‌ ప్రదేశం నుంచి తరలివెళ్లినట్లు అంచనా. 
⇒ ఓల్డ్‌ నల్లకుంట పరిధిలోని ఆజమాబాద్‌ ఇండ్రస్టియల్‌ ఏరియాలోని ఓ భారీ సెల్లార్‌ గుంత కూడా మైనింగ్‌ మాఫియాకు వరంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా సెల్లార్‌ గుంత నుంచి మట్టి అక్రమంగా బయటకు తరలివెళ్తోంది. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ విభాగాల అండతోనే ఈ దందా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సెల్లార్ల నుంచి క్రషర్లకు.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు నగర శివారులో వేగంగా అభివృద్ది చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల కేంద్రంగా ‘సెల్లార్ల మైనింగ్‌ మాఫియా’పనిచేస్తోంది. హైరైజ్‌ బిల్డింగ్‌లు, పెద్ద అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, గోదాములు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ మైనింగ్‌ మాఫియా విజృంభిస్తోంది. సెల్లార్‌ తవ్వకాల్లో వెలికితీస్తున్న రఫ్‌స్టోన్, బిల్డింగ్‌ స్టోన్‌ హైదరాబాద్‌ శివార్లలో ఉన్న శంషాబాద్, గండిపేట, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ, కోకాపేట్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, కొల్లూరు, ఉస్మాన్‌నగర్, మియాపూర్, నార్సింగి తదితర చోట్ల అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లకు అక్రమంగా తరలివెళ్తోంది. కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక సంస్థలు, గనుల శాఖ అనుమతులు లేకుండా ఏర్పాటైన ఈ క్రషర్లు సైతం ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజీ ఫీజు, జీఎస్‌టీ వంటివి చెల్లించకుండా ఖజానాకు గండి కొడుతున్నాయి. ఈ క్రషర్ల ద్వారా క్రషర్‌ మెటల్‌ హైదరాబాద్‌లోని నిర్మాణ ప్రాజెక్టులకు సరఫరా అవుతోంది. 

నిబంధనలు ఏమిటి? ఎంత ఫీజు? 
భవన నిర్మాణ అనుమతులు పొందే సమయంలోనే నిర్మాణదారులు తమ సెల్లార్‌ లేదా బేస్‌మెంట్‌కు సంబంధించిన ప్రణాళికలను సమర్పించాల్సి ఉంటుంది. సెల్లార్‌ స్తాయి, విస్తీర్ణం, పార్కింగ్‌ వినియోగం వంటి వివరాలన్నీ ఈ అనుమతి పత్రాల్లో ఉంటాయి. నిబంధనల ప్రకారం అనుమతి వచ్చిన తర్వాతే సెల్లార్‌ తవ్వకాలు నిర్ణీత పరిమితికి లోబడి జరపాలి. 2025 జూలై 23న జారీ చేసిన జీఓ నంబర్‌ 17 ప్రకారం ప్రతి చదరపు అడుగుకు రూ.8 చొప్పున పర్మిట్‌ ఫీజు చెల్లించాలి. ఒకవేళ సెల్లార్‌ విస్తీర్ణం 10వేల చదరపు అడుగులకు మించితే పర్యావరణ ప్రభావ రుసుము (ఈఐఎఫ్‌) కూడా చెల్లించాలి. తెలంగాణ మైనర్‌ మినరల్‌ కన్సెషన్‌ రూల్స్‌ ప్రకారం సెల్లార్‌ తవ్వకంలో వెలికితీసే సాధారణ మట్టి (ఆర్డినరీ ఎర్త్‌), మొర్రం, గ్రావెల్‌పై సీనరేజ్‌ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం మొర్రం/గ్రావెల్, సాధారణ మట్టికి మెట్రిక్‌ టన్నుకు రూ.20 నుంచి రూ.26 వరకు సీనరేజ్‌ ఫీజు ఉంది. దీనికి అదనంగా డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ (డీఎంఎఫ్‌) ఫీజు సీనరేజ్‌లో 30 శాతం, స్టేట్‌ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎంఈటీ) ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement