హఫీజ్‌పేట్‌ హోంగార్డ్‌ ఎపిసోడ్‌లో కీలక పరిణామం | Home Guard Anand Arrested in Hafeezpet Case | Sakshi
Sakshi News home page

హఫీజ్‌పేట్‌ హోంగార్డ్‌ ఎపిసోడ్‌లో కీలక పరిణామం

Sep 19 2026 1:57 PM | Updated on Sep 19 2026 2:33 PM

Home Guard Anand Arrested in Hafeezpet Case

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలోని హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మహిళపై హోంగార్డ్‌ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా హోంగార్డ్‌ ఆనంద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు వీడియోను రిలీజ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. మహిళపై సదరు హోంగార్డు విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో వాగ్వాదానికి దిగడంతో మహిళపై హోంగార్డు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా, అతడు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో డిప్యూటేషన్‌పై అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం హోంగార్డును తిరిగి తెలంగాణ పోలీస్ శాఖకు రైల్వే అధికారులు పంపించేశారు. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సైతం తెలిపారు.

డీజీపీ సీరియస్..
మరోవైపు ఈ ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వెంటనే హోంగార్డ్ ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఏ స్థాయి వారైనా.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి ప్రవర్తనను క్షమించలేమన్నారు. ఇది శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తన ఖండించదగినదని డీజీపీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండ్‌ కేటీఆర్‌ కూడా స్పందించారు. ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌.. పోలీసుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వీడియోను కూడా కేటీఆర్‌ షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement