తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం ప్రధానంగా విపక్ష నేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అందులో తప్పులేదు. ఆయనకు ఆ హక్కు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితులు, కొందరు బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన భూములపై రేవంత్ ఆరోపణలు గుప్పించారు. వీటిపై విచారణ చేసుకోవచ్చని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్ రెడ్డి తదితరులు సవాల్ చేశారు.
ఇదే టైమ్‌లో బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఉన్న వాస్తవాలపై కూడా రేవంత్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు పార్టీల వాదనలు, పరస్పర ఆరోపణలు విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? రాజకీయ నేతలు తెలంగాణలో భూమిని ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న అనుమానం కలగదా?. రేవంత్ చేసిన ఆరోపణలలో కొన్ని నిజాలు ఉండవచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. అయినా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన వివరాలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాకపోతే కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూములు దోపిడీ చేసిందని ఏదో ఒక ఆరోపణ చేయడం బట్టకాల్చి మీద వేసినట్లుగా ఉంది.
రేవంత్ చెప్పిన వివరాల ప్రకారం చూసినా ఆ భూములు విలువ అంత ఉండదని అర్థం అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దానిపై మంత్రులు పొంగులేటి, వివేక్, దామోదరలను కమిటీగా వేయడం ఏమిటో అర్థం కాదు. అంటే మొత్తం ప్రక్రియ రాజకీయం అయిపోదా అన్న చర్చ వస్తుంది. కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లో ఎంత భూమి ఉందన్నదానిపై రేవంత్ రెడ్డి గందరగోళంగా చెప్పినట్లు అనిపిస్తుంది.
కొంతకాలం క్రితం అక్కడ వెయ్యి ఎకరాలు ఉందని ఆయనే అన్నారు. అసెంబ్లీలో 67 ఎకరాలని ప్రకటించారు. 700 ఎకరాల ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి 388 ఎకరాలు ఉందని రేవంత్ అన్నారు. ఈ భూమిని దళితులకు పంచుతానని అన్నారు. బాగానే ఉంది. కాని నిజంగా ఆ స్థాయిలో ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే ఈ మూడేళ్ల కాలంలో ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు పసికట్టలేకపోయారా? కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి, కుమారుడుల పేర ఉన్న భూముల వివరాలు కూడా ఆయన చెప్పారు.
అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పేరిట ఉన్న భూముల గురించి కూడా చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ కుటుంబం పరిధిలో 439 ఎకరాలు ఉందని అన్నారు. కేసీఆర్‌కు బంధువులు అయ్యేవారి కుటుంబాలకు ఉన్న భూములన్నీ కేసీఆర్ ఖాతాలో ఎలా వేస్తారో అర్థం కాదు. ఈ లెక్కలన్ని కాస్త గజిబిజిగా ఉన్నాయనిపిస్తుంది. సర్వే బృందాలను హడావుడిగా పంపించినా అందులో ఏమీ తేలలేదన్నది ఇప్పటికి వస్తున్న సమాచారం. ప్రభుత్వం చెబుతున్న భూమిలో దళితులే వ్యవసాయం చేసుకుంటున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ ధైర్యంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే మొత్తం ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని హరీష్‌రావు సవాల్ విసిరారనుకోవాలి.
సిద్దిపేట వద్ద హరీష్ రావుకు చెందిన భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి పరిశీలించారు. తొలుత అక్రమ భూములు అని అన్నారు. ఇప్పుడేమో తక్కువ ధరకు కొన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై క్లారిటీతో ఉంటే మంచిది. గత డెబ్బై ఐదేళ్లుగా వచ్చిన పలు భూ సంబధిత చట్టాలు ఎంతవరకు అమలు అవుతున్నాయో ఈ ఆరోపణల పర్వం తెలియచేస్తుంది.
ఇదీ చదవండి: బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!
అస్సైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లాండ్ సీలింగ్ భూములు ఇలా అనేక రకాల భూములు కాలక్రమంలో చట్టాలతో నిమిత్తం లేకుండా అన్యాక్రాంతం అవుతున్నమాట నిజమే. కాకపోతే దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. భూ సంస్కరణల చట్టం వచ్చిన రోజుల్లో నిర్దిష్ట పరిమితికి మించి ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ లెక్కలు తీసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదని చెప్పాలి. రేవంత్ రెడ్డి 22 ఎ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలో చేరిన లక్షల ఎకరాల భూమిపై బాధితులకు ఊరట కలిగిస్తారని అంతా అనుకున్నారు. కాని ఆయన చెప్పిన 12 విధానాల వల్ల ఎంతవరకు ఆ సమస్య పరిష్కారం అవుతుందో అప్పుడే తెలియదు.
రేవంత్ సీఎం కనుక జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసాన్ని 22 ఎ నుంచి చకచకా తొలగించి ఉండవచ్చు. కాని సామాన్యుడికి ఆ పరిస్థితి ఉండదన్నది నిజం. వారు అధికారుల చుట్టూ తిరగక తప్పదు. ఈ రాజకీయ వేడితో అధికారులు తగు నిర్ణయాలు చేయడానికి వెనుకాడతారు. విశేషం ఏమిటంటే రేవంత్ కేవలం రాజకీయపరంగా మాత్రమే ఆరోపోణలు చేశారు. రాజకీయ నేతలు మాత్రమే భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఇతర వర్గాలవారు కూడా అలాగే చేశారా? అంతెందుకు! రేవంత్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఒక మీడియా సంస్థ కొనుగోలు చేసిన వేల ఎకరాల భూములలో పెద్ద ఎత్తున అస్సైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దానిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు పోరాటం కూడా చేశారు. ఆ సంస్థ తప్పు చేసిందా? లేక కరెక్టుగా చేసిందా అన్నదానిపై గత కేసీఆర్ ప్రభుత్వం చెప్పలేదు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా తేల్చదు. దానికి కారణం అందరికి తెలుసు కదా!
ఇదొక్కటే కాదు. అనేక మంది బడాబాబులు చట్టాలను ఉల్లంఘించి భూములను కొనుగోలు చేశారనో, అక్రమించారనో తరచు వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎంత శాతం మందిపై చర్య తీసుకుంటున్నారంటే సమాధానం దొరకదు. కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణల మీద కేటీఆర్ గట్టిగానే స్పందించారు. ఈ క్రమంలో రేవంత్ కుటుంబంపైన ఆయన ఆరోపణలు చేశారు. రేవంత్ జీవితం ఎలా ఆరంభం అయింది? ఆయన ఆర్ధిక స్తితిగతులు ఏమిటి? జూబ్లిహిల్స్‌లో ఎలా ఇంటిని నిర్మించారు? ఆయన సొంత ప్రాంతంలో భూమి ఎలా కొనుగోలు చేశారు అన్నదానిపై విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరులకు చెందిన సంస్థకు అతి తక్కువ ధరకు రెండు ఎకరాలు ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించారు.
హరీష్ రావు నిర్దిష్టంగా రేవంత్ కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీరిద్దరు చేసిన అభియోగాలలో ఎన్నిటికి ఆధారాలు ఉన్నాయో తెలియదు. కాని పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న నేపథ్యంలో ప్రజలలో ఇదొక చర్చగా ఉంటుంది. రేవంత్ వ్యూహాత్మకంగానే 22ఏ అంశాన్ని రాజకీయంగా మార్చారని అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, హామీలు అన్నీ నెరవేర్చడం కష్టమైన పరిస్థితి మొదలైన అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని తెలివిగా కేసీఆర్ కుటుంబంపై భూముల ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మరలించడానికి యత్నించినట్లు అనిపిస్తుంది. 22 ఎ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ, రేవంత్ స్వయంగా ఆ విషయంపై మళ్లీ మూడు గంటలు ప్రసంగించడం, బీఆర్‌ఎస్ పైన, కేసీఆర్ కుటుంబంపైన దాడి చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.
అయితే ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంతో పాటు తన కుటుంబంపై కూడా వచ్చిన ఆరోపణలకు రేవంత్ జవాబు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. హైకోర్టు లేదా సుప్రింకోర్టు సిటింగ్ జడ్జితో ఈ ఆరోపణలన్నిటిపైన విచారణకు సిద్దమని కేటీఆర్, హరీష్‌లు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ లేదా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఈలోగా మంత్రుల కమిటీ వేయడంతో ఈ కధ ఎన్ని మలుపులు తిరుగుతుందో అప్పుడే చెప్పలేం.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


