పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చీలిక నేపథ్యంలో పార్టీ పేరు, గుర్తు ఇప్పటికే దూరం కాగా.. ఆ వెంటనే అభ్యర్థుల విషయంలోనూ షాకులు ఎదురవుతున్నాయి. నందిగ్రామ్‌లో మమత వర్గం ప్రకటించిన అభ్యర్థి అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్న మరుసటి రోజే.. ఇటు ఇవాళ రెజీనగర్ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
రెజీనగర్‌లో మమతా బెనర్జీ వర్గం అనూహ్యంగా ఎంపిక చేసిన వ్యక్తి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ. ఆయనకు నియోజకవర్గంతో గట్టి రాజకీయ అనుబంధమే ఉంది. ఇక్కడి నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయన సొంతం. 2013లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజీనగర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2016లోనూ కాంగ్రెస్ తరఫున అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2021లో టీఎంసీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఆయనను రెజీనగర్ నుంచి కాకుండా బెల్డంగా నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. అక్కడ ఆయన ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఉప ఎన్నికలో మళ్లీ తన పాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న పరిచయం, గత రాజకీయ అనుభవం ఆయనకు కలిసొస్తాయని దీదీ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఇప్పుడు తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటూ.. పోటీ నుంచి తప్పుకున్నారు.
పార్టీకి ప్రస్తుతం అధికారిక గుర్తు లేకపోవడంతో పాటు, కార్యకర్తలు ప్రస్తుతం అధికార పార్టీ నుంచి, ప్రభుత్వ యంత్రాంగాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘‘చాలామంది పని కోసం నియోజకవర్గాన్ని విడిచి వలస వెళ్లారు. మిగిలినవారేమో పోలీసులకు భయపడి తన వెంట నిలబడలేమని చెబుతున్నారు. కార్యకర్తలే లేకుండా ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహించడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే నా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నా’’ అని రబీ ఉల్ చెప్పారు.
నందిగ్రామ్‌లో మొదలైన కలకలం
మమతా బెనర్జీ వర్గం నందిగ్రామ్ ఉప ఎన్నికకు సంచితా ప్రధాన్ డేను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆమె సెప్టెంబర్ 18న తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన అధికారిక వివరణ మాత్రం ఇవ్వలేదు.
అయితే అభ్యర్థి తప్పుకోవడంతో మమత వర్గం నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి తీసుకున్నదని మమతా బెనర్జీ చెప్పారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది బీజేపీ కుట్ర అని ఆమె ఆరోపించారు. అయితే ఆ మద్దతు ప్రకటించిన కాసేపటికే మిలన్‌ను పాత హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నందిగ్రామ్ వ్యవహారం మరింత అనూహ్య మలుపులు తిరిగింది.

రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ(ఎడమ), సంచితా ప్రధాన్ డే(కుడి)
ఇప్పుడు రేజీనగర్‌లోనూ..
నందిగ్రామ్ పరిణామం నుంచి తేరుకోకముందే రెజీనగర్‌లోనూ మమత వర్గానికి చెందిన అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ పోటీ నుంచి తప్పుకోవడం తాజా పరిణామం. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికే దీదీ మద్దతు ఇస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
అసలు టీఎంసీలో ఏం జరుగుతోంది?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత.. కొనసాగుతున్న అంతర్గత పోరు కూడా కీలకంగా మారింది. మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై హక్కు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులు కేటాయించింది. మమత వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించగా.. రితబ్రత వర్గానికి ‘డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ‘ఎన్వలప్’ గుర్తును కేటాయించింది.
రెజీనగర్‌లో ముందే మొదలైన పోరు
రెజీనగర్ సీటుపై కూడా మమత వర్గం, తిరుగుబాటు వర్గం మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రితబ్రత బెనర్జీ వర్గం సెప్టెంబర్ 14న రేజీనగర్‌కు సఫియుజ్జమాన్ షేక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ఒక్కరోజు ముందే.. మమత వర్గం రబీ ఉల్ ఆలమ్ చౌద్రీని రంగంలోకి దించింది. ఇప్పుడు మమత వర్గం అభ్యర్థి తప్పుకోవడంతో రెజీనగర్ పోరు కొత్త మలుపు తిరిగింది.
నందిగ్రామ్‌లో ఎవరెవరు?
నందిగ్రామ్ బైపోల్‌లో బీజేపీ తరఫున హసిరాణి రథ్ బరిలో ఉన్నారు. ఆమె గతంలో సువేందు అధికారి సహాయకుడిగా పనిచేసి.. హత్యకు గురైన చంద్రనాథ్ రథ్ తల్లి. కాంగ్రెస్ మిలన్ ప్రధాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అరెస్టై జైల్లో ఉన్నారు. వామపక్షాల తరఫున సీపీఐ నుంచి శాంతిగోపాల్ గిరి పోటీ చేస్తున్నారు. ఇక టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో రెండు వర్గాలు వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. మమతా బెనర్జీ వర్గం సంచితా ప్రధాన్ దేను, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం మొహమ్మద్ ఎతేషాముల్ హక్‌ను బరిలోకి దించింది. అయితే సంచితా ప్రధాన్ దే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థికి మమత మద్దతు ప్రకటించారు.
రెజీనగర్‌లో..
ఇక్కడ బీజేపీ తరఫున ఆ పార్టీ ముర్షిదాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు శఖరవ్ సర్కార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొహమ్మద్ అబ్దుల్లాహిల్ కాఫీని అభ్యర్థిగా ప్రకటించింది. వామపక్షాల తరఫున సీపీఎం నుంచి సయ్యద్ అసద్ అలీ బరిలో ఉన్నారు. సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో ఆర్‌ఎస్‌పీ కూడా ప్రత్యేకంగా బికాష్ చంద్ర మిశ్రాను పోటీకి దించింది.
ఇక టీఎంసీ విషయానికి వస్తే.. మమతా బెనర్జీ వర్గం మాజీ ఎమ్మెల్యే రబీ ఉల్ ఆలమ్ చౌద్రీని, రితబ్రత బెనర్జీ వర్గం షేక్ సఫియుజ్జమాన్‌ను అభ్యర్థిగా ప్రకటింటించాయి. రబీ ఉల్ కూడా తాజాగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ మమతా వర్గం ప్రకటించిన అభ్యర్థుల ఉపసంహరణ చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు టీఎంసీ పేరు, గుర్తుపై వివాదం.. మరోవైపు నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు.. ఇప్పుడు రెజీనగర్ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోవడం.. ఇలా వరుస పరిణామాలతో బెంగాల్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: ఫిక్సింగ్‌లో భాగంగానే నందిగ్రామ్ డ్రామా!


