మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ! | Trump Bans CNN MS NOW and Politico From White House | Sakshi
Sakshi News home page

మీడియాపై ట్రంప్ ప్రతాపం.. ఆ దిగ్గజ సంస్థలకు నో ఎంట్రీ!

Sep 19 2026 7:56 AM | Updated on Sep 19 2026 7:57 AM

Trump Bans CNN MS NOW and Politico From White House

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి అనుమతించబోమని ప్రకటించారు. ఈ మూడు సంస్థలు తన ప్రభుత్వం, అమెరికాపై పదేపదే ‘ఫేక్ న్యూస్’ ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మరికొన్ని మీడియా సంస్థలపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

ట్రంప్ శుక్రవారం తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ వార్తా సంస్థలు ‘ఫేక్ న్యూస్’ ప్రచురిస్తున్నందుకే వైట్‌హౌస్ నుంచి నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పరిపాలన, అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశానికి సంబంధించిన వార్తల్లో ‘కల్పిత కథనాలు, అబద్ధాలు’ రాయడానికి మీడియా సంస్థలను అనుమతించకూడదని ఆయన అన్నారు. అయితే ఏయే కథనాలు లేదా ఏదైనా ప్రత్యేక ఘటన ఈ నిర్ణయానికి కారణమయ్యాయో ట్రంప్ వివరించలేదు.

ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పేర్లను కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. అయితే వీటిపై నిషేధం విధించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రంప్‌కు మీడియా సంస్థలతో విభేదాలు కొత్తేమీ కాదు. ఆయన తొలి అధ్యక్ష పదవీకాలంలో సీఎన్‌ఎన్‌ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్‌హౌస్ ప్రెస్ పాస్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించగా, న్యాయస్థానం ఆ పాస్‌ను పునరుద్ధరించాలని ఆదేశించింది. 2025లో అసోసియేటెడ్ ప్రెస్‌ (ఏపీ)ను కూడా కొన్ని వైట్‌హౌస్ కార్యక్రమాల నుంచి నిషేధించారు. మెక్సికో గల్ఫ్‌ను ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా పేర్కొనడం కొనసాగించడమే అందుకు కారణంగా ట్రంప్ పరిపాలన పేర్కొంది.

సీఎన్‌ఎన్‌, పొలిటికో వంటి సంస్థలు తమ జర్నలిస్టులు వైట్‌హౌస్‌లో వార్తలను కవర్ చేసే హక్కును సమర్థించాయి. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ స్వేచ్ఛా పత్రికా హక్కును రక్షిస్తుందని పేర్కొన్నాయి. మీడియా సంస్థలను వైట్‌హౌస్ నుంచి పూర్తిగా మినహాయించే నిర్ణయం ఎంతవరకు చట్టబద్ధమన్నది దాని పరిధిపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పరిమిత స్థలాల్లో జరిగే కొన్ని కార్యక్రమాలకు మీడియా ఎంపికపై అధ్యక్షుడికి విస్తృత అధికారం ఉన్నప్పటికీ, సాధారణ వైట్‌హౌస్ ప్రెస్ సౌకర్యాలు లేదా ప్రెస్ పూల్ నుంచి విస్తృతంగా మినహాయించడం రాజ్యాంగపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి: ఆ గణపయ్య హుండీ తెరవగానే.. కళ్లు చెదిరే కానుకలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement