Photo Credit: Twitter
ఉత్తర కొరియా నిర్వహించిన భూగర్భ అణు పరీక్షల కారణంగా మౌంట్ మంటప్ (Mount Mantap) పర్వతం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 1,399 భూకంపాలు సంభవించినట్లు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘సైన్స్’ (Science) లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఉత్తర కొరియా గతంలో జరిపిన అణు బాంబు పేలుళ్లు అక్కడి భూగర్భ పొరలను తీవ్రంగా దెబ్బతీశాయి.
దక్షిణ కొరియాలోని పుసాన్ నేషనల్ యూనివర్సిటీ, చైనాలోని చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 2008 నుంచి 2025 మధ్య కాలానికి సంబంధించిన భూకంప తరంగాల డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఉత్తర కొరియా 2006 నుంచి 2017 మధ్య కాలంలో పుంగ్యే-రి (Punggye-ri) పరీక్షా కేంద్రంలోని మంటప్ పర్వతం కింద ఆరు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించింది.

ఉత్తర కొరియాలోని పుంగ్యే-రి అణు పరీక్షా స్థావరం ఉపగ్రహ చిత్రం (PC: Twitter)
ఈ శక్తివంతమైన పేలుళ్ల వల్ల అక్కడ శతాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న భూగర్భ ఫాల్ట్ లైన్లు (భూకంప బద్దలు) మళ్లీ యాక్టివ్ అయ్యాయి. 2017లో ఉత్తర కొరియా నిర్వహించిన ఆరవ, అత్యంత భారీ అణు పరీక్ష (హైడ్రోజన్ బాంబు పరీక్ష) తర్వాతే అత్యధిక ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఒక్క పరీక్ష తర్వాతే దాదాపు 1,330 కి పైగా భూకంపాలు సంభవించాయి.
సాధారణంగా పెద్ద పేలుళ్లు జరిగిన కొన్ని రోజులు లేదా వారాల్లోనే ప్రకంపనలు తగ్గిపోతాయి. కానీ మంటప్ పర్వత ప్రాంతంలో మాత్రం 2017 పరీక్ష జరిగిన మూడు వారాల తర్వాత ప్రకంపనలు ప్రారంభమై, 2025 వరకు కాలక్రమేణా వాటి ఫ్రీక్వెన్సీ (తీవ్రత) పెరుగుతూ రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎక్కువగా 2.0 నుండి 3.0 మధ్య నమోదైనప్పటికీ, కొన్ని ప్రకంపనలు 3.4 తీవ్రతను కూడా తాకాయి. ఈ ప్రాంతం సహజంగా భూకంపాలు వచ్చే ప్రాంతం కాకపోయినప్పటికీ, అణు పరీక్షల వల్లే భూమి లోపలి పొరల్లో ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఇదీ చదవండి: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద కలకలం


