ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారన్న సౌదీ అరేబియా ఆరోపణలు పశ్చిమాసియాలో కొత్త రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మక్కా దిశగా వచ్చిన డ్రోన్‌ను నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని ప్రకటించగా.. హౌతీలు మాత్రం మక్కా లేదా ఇతర పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందిస్తూ.. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మక్కా, మదీనా, అల్‌అక్సా మసీదు సహా పవిత్ర స్థలాలు, యాత్రికుల భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మతపరమైన పవిత్రతను ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆయుధంగా మార్చొద్దని ఆయన హెచ్చరించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
కేవలం ఒక డ్రోన్‌ను అడ్డగించామన్న ప్రకటన ఆధారంగా ఒక నిర్దిష్ట వర్గాన్ని నేరుగా నిందించలేమని ఆయన పేర్కొన్నారు. యెమెన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఇప్పటికే స్పష్టంగా ఖండించిందని గుర్తుచేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడుతున్న నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఇస్లామిక్ దేశాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని, దీనిపట్ల ఈ ప్రాంత దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సౌదీ ప్రకటన..
ఇదిలా ఉండగా.. మక్కా గగనతలంలోకి ప్రవేశించకముందే మంగళవారం సాయంత్రం ఒక డ్రోన్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. ఈ ఘటనను మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కీ తీవ్రమైన 'ఉగ్రవాద చర్య'గా అభివర్ణించారు. అయితే, ఈ ఆరోపణలను హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ సౌదీ అరేబియా అల్లిన కట్టుకథలని కొట్టిపారేశారు. తమ దాడులు కేవలం సౌదీ సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలపై మాత్రమే ఉంటాయని చెప్పారు.
పాక్ రియాక్షన్..
ఇక మక్కా ఘటనపై పాకిస్తాన్ వైఖరి మరింత కీలకంగా మారింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కూటమిలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రక్షణ వ్యూహాలకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ పవిత్ర స్థలాల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం ఉండాల్సిన అవసరం లేదని, ఒకవేళ మక్కాపై దాడి జరిగితే దాన్ని రక్షించడం ప్రతి ముస్లిం దేశం మొదటి బాధ్యత అని ఆయన అన్నారు. మూడు దేశాలు సంతకం చేసిన దేశాల్లో దేని ప్రాదేశిక సమగ్రత లేదా భౌగోళిక సరిహద్దులపై దాడి జరిగినా ఒప్పందం ప్రకారం ముందుకెళ్తామని వివరించారు.
ఇదీ చదవండి: పాపం సౌదీ.. కీలక సమయంలో హ్యాండిచ్చిన ట్రంప్


