జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (JeM) ఉగ్ర సంస్థకు చెందినవారై ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో చేపట్టిన గాలింపు చర్యలు.. చివరకు భారీ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి.
ఉధంపూర్‌లోని సోహన్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. రాత్రంతా కొనసాగిన ఆపరేషన్ అనంతరం గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్, పారా (స్పెషల్ ఫోర్సెస్), జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.ప్రాథమిక సమాచారం మేరకు జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు, వారి గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Udhampur, Jammu and Kashmir: Security forces continued their operation in the Majalta area of Udhampur district following reports of suspicious movement in the forested Khubban/Brettal-Sowan belt pic.twitter.com/crzAKvev9h
— IANS (@ians_india) September 17, 2026
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాయి. సెప్టెంబర్ 5న బుద్గాం జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ భద్రతా బలగాల కాల్పుల్లో హతమైనట్లు అధికారులు తెలిపారు. ఉధంపూర్‌లో తాజా ఎన్‌కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా జరిగింది.
ఇదీ చదవండి: రెడ్ లైన్‌గా మక్కా నగరం! ఎందుకో తెలుసా?


