ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అల్లకల్లోలం దెబ్బకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రధాని షెహబాద్ షరీష్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. చమురు వినియోగాన్ని, ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా ‘స్మార్ట్ లాక్‌డౌన్’,పొదుపు చర్యల ప్రణాళికను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల సౌదీ అరేబియాలోని ఇంధన స్థావరాలపై దాడులు జరగడం, గల్ఫ్ దేశాలలోని కీలక జలమార్గాల్లో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 4.10 పెంచగా, హై స్పీడ్ డీజిల్ ధరను రూ. 6.41 పెంచింది. దీంతో పాక్‌లో పెట్రోల్ ధర రూ. 384.34కి, డీజిల్ ధర రూ. 415.83కి చేరింది. ఈ భారీ భారాన్ని పూర్తిగా భరించే స్థితిలో ఆర్థిక వ్యవస్థ లేకపోవడంతో, వినియోగాన్ని తగ్గించుకోవడమే ఏకైక మార్గంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కీలక ప్రతిపాదనలు
ఇంధన వినియోగానికి కళ్లెం వేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించి పలు కీలక ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.గత సంక్షోభాల సమయంలో అమలు చేసినట్లుగానే, మార్కెట్లను త్వరగా మూసివేయడం,పని దినాలను తగ్గించడం (ఉదాహరణకు 4 రోజుల పని విధానం) వంటి నిబంధనలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా పొదుపు చర్యలను కఠినతరం చేయనున్నారు.
ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ప్రధాని ‘ఫ్యూయల్ రిలీఫ్ స్కీమ్’ కింద ద్విచక్ర వాహనదారులకు, కార్ల యజమానులకు కొంతమేర రాయితీలు ఇస్తున్నప్పటికీ, అవి సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా తలెత్తిన ఈ ఆయిల్ క్రైసిస్‌ను తట్టుకునేందుకు పాకిస్థాన్ కేవలం ధరల పెంపుకే పరిమితం కాకుండా, డిమాండ్‌ను నియంత్రించేలా ‘స్మార్ట్ లాక్‌డౌన్’మార్గాన్ని ఎంచుకోవడం ఆ దేశ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. ఈ చర్యలు గనుక అమల్లోకి వస్తే, అక్కడి వ్యాపార రంగంపై మరోసారి తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


