'తంబూరు క్వీన్ ఫిషర్' అనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కేకే తంబూరు (36), అద్దె ఇంట్లోని ఒక గదిలో శవమై కనిపించారు. వైకోం చెంబు కట్టిక్కున్ను తురుతుకు చెందిన తంబూరు, సోమవారం మధ్యాహ్నం పులించువాడ్‌లోని ఒక అద్దె ఇంట్లో శవమై కనిపించారు. సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన ఆమె 13 ఏళ్ల కుమార్తె వచ్చిన తరువాత ఈ విషాదం వెలుగు చూసింది. ఆమె అకాల మరణం ఎంతోమంది అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.
భర్తతో విడిగా ఉంటున్న ఆమె, గత కొన్ని నెలలుగా తన 13 ఏళ్ల కూతురితో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కుమారుడు భర్త వద్ద ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన కూతురు, లోపల నుండి గొళ్ళెం వేసి ఉండటాన్ని గమనించింది. కిటికీలో నుంచి చూడగా తల్లి ఉరివేసుకుని కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వైకోం పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం అనంతరం, మృతదేహాన్ని కట్టిక్కున్నులోని ఆమె పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.
బంధువుల ఆరోపణలు
పాలక్కాడ్‌కు చెందిన ఒక యువకుడితో ఆమెకు సాన్నిహిత్యం ఉందని, వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలను చూపిస్తూ ఆ యువకుడు ఆమెను బెదిరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.

ఎవరీ క్వీన్ ఫిషర్
'Queen Fisher' పేరిట యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ, సాంప్రదాయ చేపల వేట వీడియోలతో కేరళకు ఒక అరుదైన చేపలు పట్టే పద్ధతి పరిచయం చేసిన ఘనత తంబూరు సొంతం. తరతరాలుగా ఆమె కుటుంబంలో వస్తున్న చేపలు పట్టే పనే తంబూరు జీవిత గమనాన్ని మార్చివేసింది. పదవ తరగతి చదువు పూర్తి చేశాక, ఆమె తన తల్లితో కలిసి చేపలు పట్టడం మొదలుపెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయంతో తన తమ్ముళ్లు, చెల్లెళ్ల చదువును పూర్తి చేసింది.
ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు
కుటుంబాన్ని పోషించుకునేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, డ్రైవింగ్ స్కూల్‌లో పని, వస్త్ర తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నప్పటికీ, తంబూరు తన కుటుంబం యొక్క సాంప్రదాయ చేపల వేటను ఎన్నడూ వదులుకోలేదు. వారు పోటు ఎక్కువగా ఉన్నప్పుడు పడవలో వెనుక జలాల్లోకి వెళ్లి, వల గానీ ఎర గానీ లేకుండా బురద, రాళ్ల మధ్య వెతుకుతూ చేతులతో చేపలు పట్టేవారు. అలా ఆమె తొలి వీడియోకే 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భర్త నుండి విడిపోయి, తమ కుటుంబ జీవనాధారమైన సాంప్రదాయ చేపల వేటను వేలాదిమందికి సుపరిచితం చేసిన తంబూరు, 36 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా కన్ను మూయడం విషాదం.
ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!


