తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుంటూపెరిగిన పిల్లలు భవిష్యత్తును బంగారంగా మార్చుకుంటున్నారు అనడానికి బి. నిఖిత ఉదాహరణగా నిలుస్తుంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని గండిగూడెం గ్రామవాసి అయిన నిఖిత ఇటీవల ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో ఐదు బంగారు పతకాలు సాధించింది. ‘ఆటోడ్రైవర్ కూతురు బంగారం’ అంటూ అందరి ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా నిఖిత చెప్పిన విషయాలు ఈ తరం వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
‘‘మేం చదువుకోలేదు. పొద్దున నుంచి రాత్రి దాకా ఆటో నడుపుకొని కష్టంగా బతుకుతున్నాం. మీరు మాలాగ ఉండకూడదు... అంటుంటారు మా నాన్న. నాన్న ఒక్కడి సంపాదనతోనే ఇంట్లో ఐదుగురం బతకాలి. నాన్నకు కష్టం రాకుండా చదువులో ముందంజలో ఉంటూ, మమ్మల్ని మేం తీర్చుదిద్దుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నాం’’ అంటూ చెప్పిన నిఖితకు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఇద్దరూ డిగ్రీ స్థాయిలో చదువుకుంటున్నారు. తల్లి చంద్రకళ గృహిణి. లక్ష్యం వైపు... ‘‘మా నాన్న మాతో ‘బిడ్డా మనకు ఆస్తులేవీ లేవు.
చదువు ఒక్కటే మీరు సంపాదించుకోవాల్సిన ఆస్తి’ అంటుంటారు. ఆ మాటలే మమ్మల్ని మరింత ముందుకు నడిపించాయి. చిన్నప్పటి నుంచి అమ్మనాన్నలు పడుతున్న కష్టాన్ని చూసి పెరిగినవాళ్లం. వారి కలలను నెరవేర్చడంతోపాటు మా లక్ష్యానికి చేరువకావాలని తపన పడుతున్నాం. ఈ నెలలో ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో ఐదు బంగారు పతకాలు వచ్చినప్పుడు ‘నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది బిడ్డా’ అని నాన్న చాలా సంతోషించారు.
పోటీని ఎదుర్కొంటూ... ‘ఈ సౌకర్యాలు ఉంటే ఇంకా సాధించేదాన్ని’ వంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోను. ఏ రంగంలోనైనా ఎదగాలంటే అందుకు తగిన శ్రమ, అవగాహన ప్రధానంగా దోహదం చేస్తాయి. సమయం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ, ఉపయోగించుకొని, అవకాశాలుగా మలుచుకునే నేర్పును అలవర్చుకోవడం కొందరే చేయగలరు. నా ప్రయత్నాలకు మా ప్రొఫెసర్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు తర్వాత చూద్దాంలే అనే ఆలోచన ఉంటుంది. కానీ, ఏ వనరులు లేనప్పుడు అందుబాటులో ఉన్నవాటితోనే ఆకాశాన్ని చేరుకోవాలనే తపన ఉంటుంది.
ఈ తపనే రోజులో ఎక్కువ గంటలు చదువుపైన దృష్టిపెట్టేలా చేసింది. రీసెర్చ్ వైపుగా ఆసక్తిని పెంచింది. నన్ను నేను కొత్తగా మలుచుకునే అవకాశాలను ఇచ్చింది. ఎక్కడా డీలా పడి΄ోకుండా ఇన్నాళ్లకు అమ్మ నాన్నకు సరైన కానుకను ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఆటో డ్రైవరన్న కూతురు బంగారం అని చుట్టుపక్కల వాళ్లు అంటుంటే మరింత సంతోషంగా ఉంది’’ అని వివరించింది నిఖిత.
నన్ను నేను మార్చుకుంటూ...
టెన్త్ క్లాస్‌లో మా ఫ్రెండ్స్ కన్నా తక్కువ మార్కులు వచ్చినప్పుడు చాలా బాధనిపించింది. అమ్మనాన్నలు ఏమీ అనలేదు కానీ, అప్పటి నుంచీ నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. సరైన టైమ్ టేబుల్ సెట్ చేసుకొని, నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఇంటర్మీడియెట్, డిగ్రీలో మంచి మార్కులు సాధించాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే మొదటి నుంచీ ఇష్టం ఉండేది.
ఈ సబ్జెక్ట్‌లో ఇన్నోవేషన్స్, డ్రగ్ డిజైన్, రీసెర్చ్, టీచింగ్... ఇలా భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి ఎంపికలు ఉన్నాయి. టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా కెమిస్ట్రీ టీచర్‌లా నేనూ ఎదగాలనుకునేదాన్ని. కెమిస్ట్రీలోనే పీహెచ్‌డీ చేసి, ప్రొఫెసర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతో చదువులో రాణిస్తున్నాను. దీంతో పాటు చిత్రకారిణిగానూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.
– నిఖిత
– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులోనూ అద్భతంగా తకిల్..!శబరిమలలో..)


