న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఆస్టిన్ జిన్.. క్షయవ్యాధి (ట్యూబర్‌క్యులోసిస్-టీబీ)ని రక్త పరీక్ష ద్వారా గుర్తించడంతోపాటు, ఔషధ నిరోధకత కలిగిన బ్యాక్టీరియాను గుర్తించగల క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్‌స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్(సీఆర్‌ఐఎస్‌పీఆర్) ఆధారిత నిర్ధారణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఈ పరిశోధనకు గాను ఆస్టిన్ జిన్‌కు 2026 డేవిడ్‌సన్ ఫెలోషిప్‌తో పాటు 50,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభించింది.
న్యూయార్క్‌లోని గ్రేట్ నెక్‌లో ఉన్న విలియం ఎ. షైన్ గ్రేట్ నెక్ సౌత్ హైస్కూల్‌లో సీనియర్ అయిన జిన్.. ఎం- క్యాచ్ అనే డయాగ్నస్టిక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్న ట్యూబర్‌క్యులోసిస్ నిర్ధారణలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాడు.
సాధారణంగా టీబీ నిర్ధారణకు ఊపిరితిత్తుల లోతు నుంచి వచ్చే కఫాన్ని ఉపయోగిస్తారు. అయితే చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన నమూనాను అందించడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు భిన్నమైన విధానాన్ని జిన్ తన ప్రాజెక్ట్‌లో అనుసరించాడు. ఎం-క్యాచ్ రక్త సీరమ్‌లో ఉండే బ్యాక్టీరియా ఎన్‌డీఏ చిన్న భాగాలను గుర్తిస్తుంది. ఇందుకోసం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్‌తో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. టీబీ ఉందా లేదా అన్నదాన్ని గుర్తించడంతోపాటు, కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా నిరోధకతను కలిగించే జన్యు మార్పులను కూడా ఈ పరీక్ష గుర్తించగలదు.
ఈ సూక్ష్మ జన్యు మార్పులను గుర్తించేందుకు జిన్ ప్రత్యేక సీఆర్‌ఐఎస్‌పీఆర్ గైడ్ ఆరఎన్ఏలను రూపొందించాడు. వాటిని మైక్రోఫ్లూయిడిక్స్ చిప్‌తో అనుసంధానించాడు. దీంతో ఒకేసారి అనేక రియాక్షన్లు నిర్వహించవచ్చు. ఫలితంగా వందలాది రియాక్షన్లను, ఒకటి కంటే ఎక్కువ మ్యుటేషన్లను ఏకకాలంలో పరీక్షించే మల్టీప్లెక్స్ ప్లాట్‌ఫామ్ రూపొందింది. అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పెద్దస్థాయి పరీక్షలకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది.
భవిష్యత్తులో బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ చదివి వైద్యునిగా, శాస్త్రవేత్తగా పనిచేయాలని జిన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రయోగశాల పరిశోధనలను వైద్యానికి ఉపయోగపడే సాధనాలుగా మార్చాలనేది అతని ఆశయం. భవిష్యత్తులో ఎం క్యాచ్ ప్లాట్‌ఫామ్‌ను ఇతర అంటువ్యాధులను, క్యాన్సర్‌ను గుర్తించేందుకు కూడా ఉపయోగపడనున్నదని సమాచారం.
ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం


