వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.
భారత్‌కు ఎందుకు కీలకం?
రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.
రష్యాపైనే ప్రధాన గురి
ఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదం
ఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.
➤ India may face possible 100% tariff
➤ India among 10 nations named for tariffs
➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026
ఇక ఏం జరుగుతుంది?
హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్!


