వీసా గడువుపై నియంత్రణకు కోర్టు బ్రేకులు | US Judge blocks Trump limits on how long foreign students | Sakshi
Sakshi News home page

వీసా గడువుపై నియంత్రణకు కోర్టు బ్రేకులు

Sep 16 2026 3:22 AM | Updated on Sep 16 2026 3:22 AM

US Judge blocks Trump limits on how long foreign students

ఆర్థిక, ఉన్నత విద్యావ్యవస్థలకు నష్టం 

దుర్వీనియోగమయ్యే అవకాశాలు ఉన్నాయి 

విద్యాసంస్థలపై పట్టుకు ప్రభుత్వ ప్రయత్నమా? 

న్యాయమూర్తి వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే సమయాన్ని నియంత్రిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనకు ఫెడరల్‌ కోర్టు బ్రేక్‌ వేసింది. మరో రోజులో అమల్లోకి రావాల్సిన ఈ నిబంధన అమెరికా ఆర్థిక, ఉన్నత విద్యా వ్యవస్థలకు భారీ నష్టం చేకూర్చేదని మసాచూసెట్స్‌ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి సోమవారం వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం ఈ నిబంధన అవసరమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. భారత్‌సహా అమెరికాలో ఉంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చేది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 

ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు, ఎక్సే్ఛంజ్‌ విజిటర్‌ వీసాదారులు అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే ఉండవచ్చు. జర్నలిస్టుల విషయంలో ఈ పరిమితి 240 రోజులు మాత్రమే. చైనాకు చెందిన మీడియా వారైతే 90 రోజుల కంటే ఎక్కువ సమయం అమెరికాలో ఉండేందుకు వీల్లేదు. వాస్తవానికి ఈ నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండింది. 

దేశం మొత్తానికి వద్దని వాదించిన ప్రభుత్వం
కొత్త నిబంధనలపై ఇచ్చిన స్టేను ప్రతివాదులకు మాత్రమే పరిమితం చేయాలని, దేశం మొత్తానికి అన్వయించవద్దని అమెరికా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మసాచూసెట్స్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఎఫ్‌.డెన్నిస్‌ సెలర్‌ –4 తిరస్కరించారు. న్యాయమూర్తి నిర్ణయంతో కొత్త నిబంధన అమలుకు బ్రేక్‌ పడుతుంది. కేసుపై న్యాయస్థానంలో విచారణ సాగుతుంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను సుమారు 600 ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు సవాలు చేశాయి. అయితే అమెరికాలో ఐదు వేలకుపైగా విద్యా సంస్థలున్నాయని, పిటిషనర్లకు మాత్రమే స్టే వర్తింపజేయడం సమస్యలకు దారితీస్తుందని, ఒక్కో విద్యార్థి, సంస్థ ఈ నిబంధనల పరిధిలోకి వస్తారా? లేదా? అన్నది పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు.

 ‘‘సాధారణంగా ఒక పీహెచ్‌డీ కోర్సు పూర్తయ్యేందుకు ఆరేళ్ల సమయం పడుతుంది. కాబట్టి విద్యార్థి వీసాలకు నాలుగేళ్ల కటాఫ్‌ విధించడం విచిత్రం’’అని హార్వర్డ్‌ విద్యాసంస్థ అధ్యక్షుడు అలన్‌ ఎం గార్బర్‌ వ్యాఖ్యానించారు. అయితే వీసాలపై ఇలాంటి పరిమితులు విధిస్తేనే మోసాలను అరికట్టవచ్చని, వీసా గడువు తీరిన తరువాత కూడా అమెరికాలో ఉండిపోవడాన్ని అడ్డుకోవచ్చునని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ వాదించింది. అయితే కొత్త నిబంధన కూడా దుర్వీనియోగం అయ్యేందుకు అవకాశముందని న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

‘‘ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే విదేశీ జర్నలిస్టుల వీసాలు పొడిగించకుండా ఉండేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రయత్నించే అవకాశాలు ఎక్కువ’’అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ‘‘కొత్త నిబంధనకు, దాని వెనుక ఉన్న హేతువుకు మధ్య సంబంధం బలహీనంగా కనిపిస్తోంది. న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ కొత్త నిబంధనలు నిజంగానే దేశ భద్రత, సరిహద్దుల రక్షణకు ఉద్దేశించిందా? లేక అప్రకటిత లక్ష్యాల సాధనకా?.. ఉదాహరణకు విద్యాసంస్థలు, మీడియాపై ప్రభుత్వం మరింత పట్టు సాధించేందుకా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి’’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement