భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న అమెరికా బలగాలను ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షించేందుకు ఈ ఆయుధాలను ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.
అయితే ఈ ఆయుధాలు ఎప్పుడు కక్ష్యలోకి పంపారు? ఎన్ని ఉన్నాయి? వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? అనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఉపగ్రహాలను నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసే ఆయుధాల కంటే.. కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే ఎలక్ట్రానిక్ యుద్ధ లేదా రేడియో జామింగ్ పరికరాలు అయ్యే అవకాశం ఉంది.
అంతరిక్షంలో ఆయుధాల వినియోగం కొత్త అంశం కాదు. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం కక్ష్యలో అణ్వాయుధాలు, ఇతర సామూహిక విధ్వంస ఆయుధాలను ఉంచడాన్ని నిషేధిస్తుంది. అయితే సంప్రదాయ ఆయుధాలను భూమి కక్ష్యలో ఉంచడాన్ని అది స్పష్టంగా నిషేధించదు. అందువల్ల ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు వంటి సామర్థ్యాలకు అవకాశం ఉంది.
ఇప్పటికే చైనా, రష్యా!
చైనా, రష్యా ఇప్పటికే వివిధ అంతరిక్ష వ్యతిరేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ఉపగ్రహాలను అడ్డుకోవడం, వాటి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం లేదా ధ్వంసం చేయడం కోసం జామింగ్, స్పూఫింగ్, సైబర్ చర్యలు, ప్రత్యక్ష ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు వంటి సామర్థ్యాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్ కూడా ఉపగ్రహ వ్యతిరేక సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
అమెరికా ప్రకటనపై చైనా అంతరిక్షాన్ని యుద్ధభూమిగా మార్చడం, ఆయుధ పోటీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా కూడా అంతరిక్షాన్ని ఆయుధ రహిత ప్రాంతంగా ఉంచాలని కోరింది. నిపుణుల ప్రకారం ఈ పరిణామం భవిష్యత్తులో ఉపగ్రహాలపై పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.


