బీడ్: ఎన్నికష్టాలు ఎదురైనా సరే, తన ఇద్దరు కుమార్తెలను బాగా చదివించి, ప్రయోజకులను చేయాలన్నదే ఆ తల్లి లక్ష్యం. వారి కోసమే రోజంతా కష్టపడి పనిచేస్తోంది. అనుకోకుండా వచ్చిన ఓ చిన్న అవకాశాన్ని సైతం వదలుకో దల్చలేదు. ఎన్నడూ పరుగుపోటీలో పాల్గొన్న అనుభవం లేకపోయినా సరే, ధైర్యంగా ముందుకు వచ్చింది గతుకుల, రాళ్ల రహదారిలో కాళ్లకు చెప్పులుసైతం లేకుండా పరుగు తీసి, విజేతగా నిలిచింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి బహుమతిగా రూ.3 వేలు గెల్చుకుంది.
మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన రమాబాయి రణవీర్(47) భర్త చనిపోవడంతో బతుకు దెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో బీడ్ జిల్లా అంబాజోగైలో ఉంటూ ఇళ్లలో పనిచేస్తోంది. శనివారం ఉదయం భారతీయ శిక్షణ్ ప్రసారక్ సంస్థ నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొనేందుకు వెళ్లింది. నేత చీర, రబ్బరు చెప్పులు ధరించి అక్కడికి వెళ్లిన ఆమెకు పరుగెత్తడమెలాగన్న అనుమానం పట్టుకుంది. పరుగు మొదలైంది. చెప్పులు జారి పోతుండటంతో పరుగెత్తడం కష్టంగా మారింది. దీంతో, చెప్పుల్ని చేతిలో పట్టుకుని, చీరకొంగును పైకి ఎగసి కట్టి..కంకర రాళ్లు, గుంతలు అడ్డుపడ్డా లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఒక్కొక్కరినీ అధిగమించి, ఒంటరిగా మూడు కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వేల రూపాయల బహుమతిని, ట్రోఫీని గెల్చుకుంది. ఇల్లు గడవటానికి రోజూ పరుగులు తీస్తూనే ఉంటా. ఈ రోజు మాత్రం నా ఇద్దరి కూతుళ్ల చదువుల కోసం పరుగెత్తా’అంటూ బహుమతి అందుకుంటూ రమాబాయి సగర్వంగా ప్రకటించింది.
ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?


