అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంటలో కురిసిన భారీ వర్షంతో ఉప్పొంగిన వరద ప్రవాహానికి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. ఆ నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్‌బ్రిడ్జ్‌లు ధ్వంసమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వీడియోల్లో కొత్తగా నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో భూభాగం చాలా నిటారుగా ఉండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. దీంతో వరద వేగం అనూహ్యంగా పెరిగింది.
62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
వరదల అనంతరం ఫాంటమ్ రాంచ్ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు చెప్పలేదు. అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.
UGC videos show hikers and campers scrambling for cover as heavy rain and strong winds hit the Phantom Ranch area of #GrandCanyon National Park, with swollen waterways and debris seen floating on the Colorado River. Other footage shows people awaiting rescue and a helicopter… pic.twitter.com/x2lu0ZkFMb
— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 31, 2026
ఒక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. సుమారు 50 మంది హైకర్లు క్రీక్‌లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని చూశారు. అనంతరం భారీ శిథిలాలు, నిర్మాణాలు వరదలో కొట్టుకురావడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారని అన్నారు. మరోవైపు.. బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్, నార్త్ కైబాబ్ ట్రైల్‌లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు. కొలరాడో నదిపై రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరోసారి ఆకస్మిక వరదలు, శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
FLOOD DANGER 🚨: Dozens of hikers were evacuated from Grand Canyon National Park after parts of the canyon were hit by devastating flooding. Officials say the flooding caused significant damage throughout parts of the park.#flood #arizona #monsoon #grandcanyon pic.twitter.com/SqA0XWkGrC
— FOX Weather (@foxweather) August 30, 2026


