గొడవలు.. అలకలు.. అరుపులు, ఆటలు ఇవన్నీ ఉండే రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది. ఈ మేరకు ప్రారంభ తేదిని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు 10వ సీజన్ లాంచ్ కానుంది.
మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది . ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అంటూ వీడియోను పంచుకున్నారు. వెరైటీ, సర్‌ప్రైజ్, డ్రామా.. ఛాలెంజ్ ప్రతీది 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశారు. స్టార్ మా, హాట్ స్టార్‌లో ప్రసారం కానున్న ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
కంటెస్టెంట్స్ వీరేనా..?
గత సీజన్ మాదిరే ఈ సారి కూడా కామనర్స్‌కి ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నారట నిర్వాహకులు. వీరి కోసం కామనర్స్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది పోటీ పడగా.. చివరకు 15 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో నుంచి దాదాపు ఆరుగురిని హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది. అంతేకాదు ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ద్వారా కూడా పంపే చాన్స్ ఉందట.
ఇక సెలెబెట్రీలలో ఎక్కువగా సీరియల్ యాక్టర్స్ ఉండబోతున్నారు. అలాగే బుల్లితెర కమెడియన్స్‌ని కూడా ఈ సారి ఎక్కువగానే హౌస్‌లోకి పంపిస్తున్నారట. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేశ్, నూకరాజుతో పాటు ఎక్స్‌ప్రెస్ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


