తనను తాను ‘శాంతి అధ్యక్షుడు’ (Peace President)గా అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఏకకాలంలో పలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌తో యుద్ధం తీవ్ర ప్రతిష్టంభనకు దారితీయగా, మరోవైపు అమెరికా దీర్ఘకాల మిత్రదేశమైన కెనడాతో భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇరాన్ తీరంలో నిలిచిపోయిన ముడి చమురు రవాణా, కెనడాపై భారీగా విధించిన దిగుమతి సుంకాలు, వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అగ్రరాజ్యాన్ని తీవ్ర ఆర్థిక, రాజకీయ ఒత్తిడిలోకి నెడుతున్నాయి.
కెనడాతో రాజుకున్న వాణిజ్య సమరం
అమెరికా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన కెనడా ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆగస్టు 21 గడువు నాటికి జరిగిన చర్చల్లో అమెరికా ఆమోదయోగ్యం కాని నిబంధనలను చేర్చడంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దీనికి ప్రతిగా సెప్టెంబర్ 8 నుంచి తాము కూడా సమాన స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా స్పష్టం చేసింది. దాంతో ఇరు దేశాల మధ్య సంపూర్ణ వాణిజ్య యుద్ధం మొదలయ్యింది.
‘లేక్ అమెరికా’ పేరు మార్పు వివాదం
కెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఈ వివాదాన్ని మరింత పెంచుతూ సరిహద్దు సరస్సు ‘లేక్ అంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ సరస్సులో దాదాపు 75 శాతం కెనడాలోని అంటారియో ప్రావిన్స్ పరిధిలో ఉండటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ సైతం తాము ఈ పేరు మార్పును పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు.
లొంగే ప్రసక్తే లేదన్న కెనడా ప్రధాని
వాషింగ్టన్ చర్చల వైఫల్యం అనంతరం కెనడా ప్రధాని మార్క్ కార్నీ దేశ ప్రజలనుద్దేశించి తీవ్రస్థాయిలో ప్రసంగించారు. అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని, కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 34 కోట్ల జనాభా, భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన అగ్రరాజ్యం ముందు 4 కోట్ల జనాభా ఉన్న కెనడా వెనక్కి తగ్గకుండా ధీటుగా నిలబడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇరాన్ ప్రతిఘటన – హార్ముజ్ జలసంధి మూసివేత
మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులకు ప్రతిగా ఇరాన్ వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం, ఎల్ఎన్‌జీలో 19 శాతానికి మార్గమైన హార్ముజ్ జలసంధిని నిలిపివేసింది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి, ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా, ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు, జీవన వ్యయం భారీగా పెరిగాయి.
ట్రంప్ ప్రకటనలు.. యుద్ధంలో ప్రతిష్టంభన
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కాల్పుల విరమణ కోసం అర్థిస్తోందని, ఒప్పందం చివరి దశకు వచ్చిందని ట్రంప్ 38 సార్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. యుద్ధం 60 రోజులు దాటినా ఇరాన్ నుంచి ఉన్న తక్షణ ముప్పు ఏమిటనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మధ్యప్రాచ్యంలో ముగింపు లేని యుద్ధంలో అమెరికా చిక్కుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ సంక్షోభం.. పడిపోయిన ప్రజాదరణ
ఈ వరుస వివాదాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ 33 శాతానికి పడిపోయింది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు కెనడాతో వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, ఇరాన్ సంక్షోభం సమసిపోకపోవడం రిపబ్లికన్ పార్టీకి గట్టి సవాలుగా మారింది. ఫలితంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీని కోల్పోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం!


