గరగాయతో బోలెడన్నీ ఉపయోగాలు..! | Sagubadi: Forest Fruit Grey Downy Balsam Benefits | Sakshi
Sakshi News home page

గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు..!

Aug 28 2026 5:28 PM | Updated on Aug 28 2026 5:33 PM

Sagubadi: Forest Fruit Grey Downy Balsam Benefits

గరగాయను ‘గోలిక’ అని కూడా అంటారు. ఈ చెట్టుకు కొన్ని ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉంది. దీని ఆకులు, వేప చెట్టు ఆకులను పోలి పెద్దగా ఉంటాయి. కాయలు వేపకాయల కంటే పెద్దగా ఉండి గుండ్రంగా (గోళీ కాయల వలె) ఉంటాయి. ఈ చెట్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కొండ వేప అనడానికి వీటి ఆకులే కారణమనవచ్చు.

English Name : Garuga/Grey Downy Balsam
శాస్త్రీయ నామం : గరుగ పిన్నెట
Scientific Name : Garuga pinnata Roxb.
Synonym (s) : Kunthia pinnata (Roxb.) Kuntze, Garuga kenghar Buch.-Ham.
కుటుంబం : బుర్సెరేసి
Family : Burseraceae

ఉనికి: 
ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాలలో పెరుగుతుంటాయి. ఇవి దాదాపు 40–50 అడుగుల ఎత్తువరకు పెరుగ గలవు. గరగాయ చెట్టుకు ఆకులు రాల్చే స్వభావం ఉంది. ఈ చెట్లకు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, పాకిస్తాన్, చైనా, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాల్లో పెట్టింది పేరు. గరగాయ చెట్టు అన్ని నేలల్లో పెరుగుతుంది. కానీ చౌడు భూములు అనుకూలం కావు. కొన్ని ప్రాంతాలలో ఈ చెట్లను పొలంగట్టు, పెరటి స్థలంలో పెంచుకుంటారు. సముద్రమట్టానికి 400–1200 అడుగుల ఎత్తున్న ప్రాంతాల్లో వీటి ఉనికి ఉంటుంది. గరగాయ చెట్ల ప్రవర్ధనం విత్తనాలు, వేర్ల ద్వారా చేస్తుంటారు.

కొండ వేప ఉపయోగాలు:
చెట్టు పెద్దగా ఎదిగినా, కలప మాత్రం అంత గట్టిగా ఉండదు. గరగాయ చెట్ల అన్ని భాగాలు మాత్రం ఔషధ గుణాలు కూడినవని గుర్తింపు ఉంది. కలపను వంట చెరుకుగా, చిరు ఫర్నీచర్, చెక్కపెట్టెలు మొదలగు వాటికి ఉపయోగపడతాయి. తీగ తోటల్లో ఆధారం కోసం నాటుతారు (ఉదా: మిరియాల తీగ). 

చెట్ల మాను నుంచి జిగురును తీయవచ్చు (జిగురు తీస్తే చెట్లు త్వరగా అంతరిస్తాయి). బెరుడు నుంచి ‘ట్యానిన్స్‌’ లభిస్తాయి. దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు (ఉదా: తోళ్ళ పరిశ్రమ). వీటి కాయలు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటాయి. పండ్లుగా మారినప్పుడు నలుపురంగుకు మారతాయి. వీటిని తింటారు. కాయలను మాత్రం ఊరగాయ తొక్కుగా ఉపయోగిస్తారు. కాయలు చేదుగా ఉన్నప్పటికి ఊరగాయలో రుచిగా ఉంటాయి. 

ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో ఈ చెట్లను విరివిగా వాడతారు. ఆకుల రసాన్ని బ్యాక్టీరియా, ఫంగస్‌ జబ్బులను తగ్గించడానికి వాడతారు. క్యాన్సర్, కడుపు నొప్పి, చక్కెర రోగం, ఆస్త్మా (ఉబ్బసం), ఊబకాయం తదితర రోగాలను తగ్గించే ఔషధాల్లో వాడతారు.గరగాయ చెట్లను పెరటిలోను, పొలంగట్లపైన, రోడ్డుకు ఇరువైపుల నాటుకోవచ్చు. ఈ చెట్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. దీని కాయలు పక్షులకు, కోతులకూ ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ పండ్లల్లో సీ, ఈ విటమిన్లు, ఫోలిక్‌ ఆసిడ్, మినరల్స్‌ (కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, భాస్వరం, సోడియం..) 
ఉంటాయని నిర్ధారణైంది. 

ఈ చెట్లు నల్లమల ప్రాంతంలో అధికంగా లేకున్నా, రాష్ట్రంలోని ఇతర అడవుల్లో వీటి ఉనికి ఉంది. వీటిపైన పరిశోధనలు ముఖ్యంగా ఆయుర్వేదంలో జరిగినప్పటికీ.. వ్యవసాయ, అటవీ రంగాల్లో అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదు. కాబట్టి వ్యవసాయ పరంగా (ఆగ్రోఫారెస్ట్రీ) పరిశోధనలు చేపట్టినట్లయితే, ఫలితాలు రైతులకే కాకుండా ఇతరులకు ఉపయోగపడతాయి. 

వివిధ భాషల్లో గరగాయ చెట్టు పేర్లు:  
అస్సామీ: పమా, రహిమోల, తూట్‌ మల ఇంగ్లీష్‌: గరుగ, గ్రేడౌని బల్సం ఒరియా: కేకడొగట్చో కన్నడ: ఆరనెల్లి, బిలిగడ్డె, కాశతనెల్లి గుజరాతీ: కాకెడ్, కుసుంబి

తమిళం: ఆరునెత్ల, కరువెంపు తెలుగు: గరగ, కొండ వేప బెంగాలీ: జుం, కపిల మరాఠీ: కకడ్‌

మలయాళం: కెరయా, అన్నక్కార, కాట్టు కాట్టు నెత్త కోస్‌ రంబ, కారె యాం, కరువెంపు హిందీ: ఖర్పత్‌

సంస్కృతం: కర్లీకార్, కిని కిరత్‌, నేపాలీ: డబోదబె, రంసిన్‌

పూత: జనవరి – ఫిబ్రవరి
పండ్లు: జూన్‌ – ఆగస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement