సాగుబడి
ఇంటి పంట-16
మిద్దె/పెరటి తోటల్లో అల్లం పెంచడం చాలా సులభం. గ్రో బ్యాగులు లేదా కుండీలలో, తక్కువ స్థలంలోనే ఎక్కువ అల్లం పండించుకోవచ్చు.
1. మొలకలు వచ్చి ఉన్న తాజా, లావు΄ాటి అల్లం దుంపలను తీసుకోవాలి.
2. 10–12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగులు ఉత్తమం. నీరు బయటకు పోవడానికి రంధ్రాలు ఉండాలి.
3. 40% తోట మట్టి + 30% వర్మీ కంపోస్ట్/పశువుల ఎరువు + 20% ఇసుక/ వరి పొట్టు+10% వేప పిండి కలిపి మిశ్రమం సిద్ధం చేసుకోవాలి.
4. అల్లం దుంపను చిన్న చిన్న ముక్కలుగా (ప్రతి ముక్కకు కనీసం 1–2 మొలకలు ఉండేలా) కత్తిరించాలి. కత్తిరించిన ముక్కలను 1–2 రోజులు నీడలో ఆరబెట్టాలి.
5. కుండీలో మట్టి నింపి, మొలకలు పైకి ఉండేలా 2–3 అంగుళాల లోతులో దుంపలను నాటాలి.
6. ఏప్రిల్/ మే నెలలో నాటుకోవాలి. ఏప్రిల్/మే నెలల్లో నాటితే, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో తీయవచ్చు. రుతుపవనాలు ప్రారంభం కాకముందే నాటుకుంటే, వర్షాలు పడే సమయానికి మొక్క భూమిలో బాగా నిలదొక్కుకుంటుంది.
7. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. కుండీలో నీరు నిలిస్తే దుంప కుళ్ళిపోతుంది.
8. అల్లం మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి కంటే కొద్దిగా నీడ ఉండాలి.
9. నెలకొకసారి వర్మీ కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులు వేస్తే దుంపలు బాగా పెరుగుతాయి.
10. కుండీలో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తపడాలి.
11. నాటిన సుమారు 8–9 నెలలకు అల్లం పంట కోతకు వస్తుంది.
12. ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోవడం ప్రారంభించినప్పుడు మట్టిని జాగ్రత్తగా తవ్వి, దుంపలను బయటకు తీయాలి.
13. అల్లం నాటేటప్పుడు తెగుళ్లు రాకుండా ఉండటానికి, దుంపలను నాటే ముందు సూడోమోనాస్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టడం మంచిది.
14. కుండీలలో పెంచేటప్పుడు, తేమను నిలుపుకోవడానికి మట్టిపై ఎండుగడ్డి లేదా ఆకులతో మల్చింగ్ (ఆచ్ఛాదన) చేయడం మంచిది.
15. నాటిన 45 రోజులకు మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ లేదా ఘన జీవామృతం వేసి మట్టిని ఎగదోయాలి. ప్రతి 15–20 రోజులకోసారి జీవామృతం లేదా ద్రవ రూపంలోని సేంద్రియ ఎరువులను వాడటం ఉత్తమం.
16. నాటిన 90 రోజులకు దుంపలు ఊరడం (గడ్డ కట్టడం) మొదలవుతుంది. కాబట్టి ఆముదం పిండి లేదా ఎక్కువ మొత్తంలో వర్మీ కంపోస్ట్ అందించాలి. పొటాష్ కోసం చెక్క బూడిదను కొద్దిగా మట్టిపై చల్లడం వల్ల దుంపలు లావుగా అవుతాయి.
17. నాటిన 120 – 150 రోజులకు పశువుల ఎరువు వేసి మట్టిని మొక్క మొదలు దగ్గర గట్టిగా నొక్కాలి.
18. కోతకు 1–2 నెలల ముందు (సుమారు 7వ నెల తర్వాత) ఎరువులు వేయటం ఆపేయాలి.
19. అల్లం మొక్క మొదళ్లలో ఎండుటాకులు లేదా గడ్డితో కప్పి ఉంచితే తేమను నిలుపుతుంది. కుళ్ళిన తర్వాత ఎరువుగా మారుతుంది.
20. ఇంట్లో రోజూ వచ్చే బియ్యం, పప్పు కడిగిన నీళ్లను ΄ారబోయకుండా మొక్కలకు పోయాలి.
చీడపీడలను తట్టుకోవటం ఎలా?
21. ఆకులపై ఏవైనా పురుగులు కనిపిస్తే వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
22. దుంప కుళ్ళు తెగులు: అల్లం పంటకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి, మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నాటే ముందు దుంపలను ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలో శుద్ధి చేయాలి. మట్టిలో వేప పిండి కలపడం వల్ల ఈ తెగులును అరికట్టవచ్చు.
23. ఆకు మచ్చ తెగులు: ఆకులపై చిన్న చిన్న పసుపు లేదా తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు ఎండిపోతాయి. వ్యాధి సోకిన ఆకులను వెంటనే తెంపి నాశనం చేయాలి.
24. గొంగళి పురుగు కాండం లోపలికి వెళ్లి తినడం వల్ల మొవ్వు ఎండిపోతుంది. ఆకులపై పురుగు కనిపిస్తే చేతితో ఏరివేయాలి. నివారణకు 15 రోజులకోసారి వేప నూనె పిచికారీ చేయడం మంచిది.
25. దుంప కుళ్ళు ఈగ పురుగు దుంపల లోపలికి రంధ్రాలు చేసి తింటుంది. మట్టిలో వేప పిండి లేదా ఆముదం పిండి కలపడం వల్ల ఈ పురుగుల బెడద తక్కువగా ఉంటుంది.
26. 50 గ్రాముల అల్లం+ 50 గ్రాముల వెల్లుల్లి+ 60 గ్రాముల పచ్చిమిర్చి మెత్తగా నూరి.. ఆ ముద్దను లీటర్ నీటిలో కలిపి వడకట్టాలి. వడకట్టిన ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆకులను ఆశించే పురుగులను నివారించవచ్చు.
27. క్రమం తప్పకుండా జీవామృతాన్ని మొక్క మొదళ్లలో పోయడం వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
28. 5–10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని ఒక లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లలో పోయటం వలన కుళ్ళు తెగులు తగ్గుతుంది.
29. కొద్దిగా పసుపు కలిపిన నీటిని మొక్క మొదళ్లలో పోయడం వల్ల యాంటీ–ఫంగల్ లక్షణాలతో తెగులు తగ్గుతుంది.
30. ఒకవేళ మొక్క పూర్తిగా కుళ్ళిపోయి ఉంటే, ఆ మొక్కను దుంపతో సహా తీసి ΄ారేయాలి. అదే మట్టిని మళ్ళీ వాడాల్సి వస్తే, ఎండలో బాగా ఆరబెట్టి, వేప పిండి కలిపిన తర్వాతే వాడాలి.
31. అల్లం మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి, క్రమంగా ఎండిపోయి, కాండం కూడా వాడిపోయి నేలకి వాలినట్లు కనిపిస్తే దుంపలు పూర్తిగా ఊరాయని అర్థం.
32. కూరల్లోకి పచ్చి అల్లం కావాలంటే, నాటిన 5– 6 నెలల తర్వాత కూడా కొన్ని దుంపలను తీసుకోవచ్చు. ఈ సమయంలో అల్లం తక్కువ పీచు, తక్కువ ఘాటు ఉంటుంది.
33. ఎండిన అల్లం (శొంఠి) లేదా విత్తనం కోసం అయితే ఆకులు పూర్తిగా ఎండిపోయే వరకు (8–10 నెలలు) ఆగాలి.
34. దుంపలు తీయడానికి 15 రోజుల ముందే నీరు పోయడం ఆపేయాలి. దీనివల్ల మట్టి పొడిగా మారి దుంపలు తీయడం సులభమవుతుంది. దుంపలకు గాయం కాకుండా జాగ్రత్తగా మట్టిని తవ్వి బయటకు తీయాలి.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇవీ చదవండి: పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్‌ఏఓ హెచ్చరిక!


