కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు వంటి వంట గది వ్యర్థాల (కిచెన్ వేస్ట్)తో కంపోస్ట్ తయారు చేసి మిద్దె తోటలు, ఇంటిపంటల్లో మొక్కలకు వేస్తుంటాం. అయితే, ఈ కం΄ోస్టు తయారు కావటానికి చాలా రోజులు పడుతుంది. ఈ ప్రక్రియలో బెల్లం ద్రావణాన్ని ఉపయోగించటం వల్ల ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా, ఎరువు నాణ్యత కూడా పెరుగుతుంది.
1. కంపోస్ట్ త్వరగా తయారవ్వడానికి వంటగది వ్యర్థాలు సాధారణంగా కుళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది. బెల్లం ద్రావణం ఈ సమయాన్ని తగ్గిస్తుంది.
2. ఒక లీటర్ నీటిలో 50–100 గ్రాముల బెల్లం కలిపి ద్రావణం తయారు చేయాలి. కంపోస్టు బిన్‌లో వంటింటి వ్యర్థాలను వేసిన ప్రతిసారీ, ఈ బెల్లం నీటిని కొద్దిగా దానిపై చల్లాలి.
3. బెల్లంలోని చక్కెర సూక్ష్మజీవులకు తక్షణ శక్తిని ఇస్తుంది, దీనివల్ల అవి వ్యర్థాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తాయి.
4. బెల్లం ద్రావణం వాసన నియంత్రణకు, పురుగుల నియంత్రణకు చాలా ఉపయోగకరం.
5. బెల్లం నీటితో పాటు కొద్దిగా పుల్లని మజ్జిగ కలిపి కంపోస్ట్‌పై చల్లితే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను అణచివేస్తుంది.
6. ఇది ఇన్స్టంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా కూడా పనిచేస్తుంది.
7. ఒక పాత్రలో కూరగాయల తొక్కలు వేసి, అవి మునిగేలా నీరు పోయాలి. అందులో 1–2 స్పూన్ల బెల్లం వేసి బాగా కలిపి, మూత పెట్టి 3–5 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ద్రవాన్ని వడకట్టి, దానికి 10 రెట్లు నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) నేరుగా మొక్కల మొదళ్లలో పోయవచ్చు.
8. బెల్లం నీరు చల్లేటప్పుడు కంపోస్ట్ మరీ ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. తేమ మాత్రమే ఉండాలి.
9. బెల్లం నీరు వాడినప్పుడు, తేమను బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఎండు ఆకులు లేదా కార్డ్‌బోర్డ్ ముక్కలు కలపడం మంచిది.
10. బెల్లం ద్రావణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కంపోస్ట్ బిన్స్‌లో మాంసం, పాలు లేదా నూనె పదార్థాలు వేయకూడదు. ఎందుకంటే ఇవి బెల్లం ఉన్నా కూడా దుర్వాసన కలిగిస్తాయి.
11. 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లాన్ని కలిపి, అందులో వేస్ట్ డీకంపోజర్ కల్చర్‌ను కలిపి 5 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ద్రావణాన్ని కంపోస్ట్ పొరల మీద చల్లడం వల్ల వ్యర్థాలు వేగంగా ఎరువుగా మారుతాయి.
12. పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్‌లో బెల్లం నీటిని చిలకరిస్తూ 15 రోజుల పాటు కలియదిప్పితే నాణ్యమైన బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది.
13. జీవామృతం తయారీలో ఆవు పేడ, మూత్రంతో పాటు బెల్లాన్ని కలపడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇది మట్టి సారాన్ని
పెంచుతుంది.
14. చేపల అమైనో ఆమ్లం తయారీలో – చేపల వ్యర్థాలను, సమాన మోతాదులో బెల్లంతో కలిపి పులియబెట్టడం ద్వారా మొక్కలకు అద్భుతమైన పోషక ద్రావణం లభిస్తుంది.
15. పండ్ల ద్రావణం తయారు చేయటానికి కుళ్ళిన పండ్లను సమాన మోతాదులో బెల్లంతో కలిపి 5 రోజుల పాటు పులియబెట్టి, ఆ ద్రావణాన్ని మొక్కల పెరుగుదలకు ఉత్ప్రేరకంగా వాడవచ్చు.
16. బెల్లంలోని చక్కెర ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు తక్షణ శక్తిని ఇస్తుంది.
17. బెల్లం పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
18. మట్టిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా మొక్కల వ్యాధులను అణచివేసి తెగుళ్ల నియంత్రణకు సహాయపడుతుంది.
ముఖ్య గమనిక: బెల్లం ద్రావణాన్ని నేరుగా కాకుండా, తగినంత నీటితో పలచబరిచి (ఉదాహరణకు 1:10 నిష్పత్తిలో) మొక్కలకు అందించడం మంచిది.
కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా
మిద్దె తోటల బృందం
మొబైల్: 94906 02366
(చదవండి: కామాంచి/కాశబుడ్డ.. గుండె జబ్బులను అరికట్టడంలో ఫస్ట్!)


