తియ్యటి విషం | Adulterated jaggery flooding the markets | Sakshi
Sakshi News home page

తియ్యటి విషం

Oct 1 2026 5:31 AM | Updated on Oct 1 2026 5:31 AM

Adulterated jaggery flooding the markets

మార్కెట్లను ముంచెత్తుతున్న కల్తీ బెల్లం.. వినియోగదారులను ఆకర్షించడానికి బెల్లంలో రంగులు వాడుతున్న కేటుగాళ్లు 

చక్కెర, పరిమితికి మించి సల్ఫర్‌ కలిపి నాణ్యతకు తూట్లు  

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా కల్తీ బెల్లం దిగుమతి  

నిత్యం వాడితే క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ముప్పు  

వంటింటి చిట్కాలతో కల్తీ ఇట్టే పసిగట్టే వీలు  

సాక్షి, అమరావతి: వంటికి చలువ చేస్తుందని, ఆరోగ్యానికి మంచి చేస్తుందని చాలామంది చక్కెర కంటే బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. పండుగలు, పర్వదినాల్లో పిండివంటల్లో బెల్లం వినియోగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తీపి రుచి వెనుక రాష్ట్రంలో వ్యాపారుల కల్తీ దందా విచ్చలవిడిగా సాగుతోంది. కంటికి ఇంపుగా, బంగారు రంగులో తళతళలాడేలా కనిపిస్తూ.. వినియోగదారులు చూడగానే కొనాలనిపించేలా ఆకర్షించేందుకు కేటుగాళ్లు బెల్లంలో ప్రమాదకరస్థాయిలో రసాయనాలు, రంగులను కలుపుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాల్లోని కొన్ని బెల్లం తయారీకేంద్రాల నుంచి రసాయనాలు కలిపిన బెల్లం మార్కెట్‌లోకి వస్తోంది.  

కృత్రిమరంగుల కుమ్మరింత
సాధారణంగా స్వచ్ఛమైన బెల్లం ముదురు గోధుమ రంగు/నలుపు ఛాయలో ఉంటుంది. కానీ వినియోగదారులు పసుపు, బంగారు రంగులో ఉన్న బెల్లాన్నే ఇష్టపడుతున్నారనే సాకుతో కొందరు తయారీదారులు, వ్యాపారులు అక్రమదందాకు తెరతీశారు. చెరకు రసం నుంచి బెల్లం తయారీ సమయంలో శుద్ధికోసం నిబంధనల ప్రకారం సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ను కలుపుతుంటారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాల ప్రకారం ఒక కిలో బెల్లంలో 50 మిల్లిగ్రాములు మాత్రమే సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ ఉండాలి. అయితే బెల్లం ఎక్కువ పసుపు రంగులో ఉండటంతోపాటు నిల్వ సామర్థ్యం పెంచడం కోసం మోతాదుకు మించి సల్ఫర్‌ను కలిపేస్తున్నారు. బెల్లం ఆకర్షణీయంగా కనిపించాలని కృత్రిమరంగులను (సింథటిక్‌ కలర్స్‌ను) ఇష్టారీతిన కలుపుతున్నారు. 

ఖర్చు తగ్గించుకోవాలని చక్కెరతో కల్తీ 
ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధపెట్టేవారు ఖనిజ లవ­ణాలు, ఐరన్‌ వంటి పోషకాల కోసం బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న బెల్లంలో ఎక్కువశాతం చక్కెరతో కల్తీచేసినదే. నాణ్యమైన, స్వచ్ఛమైన చెరకురసంతో బెల్లం తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాచేస్తే లాభాలు మెండు­­గా ఉండవు. ఈ నేపథ్యంలో తయారీ ఖర్చు తగ్గించుకోవడంతోపాటు అడ్డదారుల్లో ఎక్కువ లాభాలను గడించడానికి పంచదార, పంచదార పాకం కలిపిన బెల్లాన్ని మార్కెట్‌లోకి పంపుతున్నారు.  

తీసిన శాంపిల్స్‌ అన్నీ కల్తీ 
రాష్ట్రంలో బెల్లం విక్రయాలపై ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ విభాగం తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ గొల్లపూడిలోని బెల్లం మార్కెట్‌లో ఐదుటన్నుల కల్తీ బెల్లాన్ని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్‌ చేశారు. ఇక్కడ మూడు శాంపిళ్లు సేకరించి పరీక్షించగా.. మూడింటిలో కృత్రిమరంగులు కలిపినట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో తీసిన శాంపిల్స్‌లోను కల్తీ వ్యవహారం బయటపడింది. నిషేధిత కృత్రిమరంగులు, హైడ్రోస్‌ వంటి తీవ్రమైన బ్లీచింగ్‌ ఏజెంట్లను కలుపుతున్నారు. బెల్లం బరువు, పరిమాణం పెంచడానికి చక్కెర పానకం, చాక్‌పౌడర్, చివరికి యూరియా వంటి ప్రమాదకర పదార్థాలను సైతం కలుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

బెల్లం కల్తీని ఇలా గుర్తించండి
» సహజమైన బెల్లం ముదురు గోధుమ, నలుపురంగులో ఉంటుంది. బాగా పసుపుగా, మెరుస్తూ ఉంటే అది కచ్చితంగా రసాయనాల బెల్లమే. ఒక గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్క వేస్తే.. స్వచ్ఛమైన బెల్లం నెమ్మదిగా కరుగుతుంది. కల్తీ బెల్లం అయితే రంగు వెంటనే నీటిలో కలిసిపోయి, అడుగున చాక్‌ పౌడర్‌/మలినాలు తెల్లగా కనిపిస్తాయి.  
» కల్తీ బెల్లం తిన్నప్పుడు స్వల్పంగా ఉప్పదనం/చేదు తగులుతుంది. స్వచ్ఛమైన బెల్లం కేవలం సహజ తీపిని మాత్రమే ఇస్తుంది.  
» చిన్న గ్లాసులో పావు టీ స్పూన్‌ మెత్తగా చేసిన బెల్లం తురుము తీసుకోవాలి. అందులో కొద్దిగా వెనిగర్‌/నిమ్మరసం వేసి గమనించాలి. ఆ బెల్లంలో రసాయనాలు ఉంటే.. యాసిడ్‌తో రియాక్ట్‌ అయి బుడగలు వస్తాయి. ఒకవేళ ఎలాంటి బుడగలు రాకపోతే అది స్వచ్ఛమైన బెల్లం అని అర్థం.  

ఆరోగ్యానికి ముప్పు 
అధిక మోతాదులో సల్ఫర్, కృత్రిమరంగులు ఉన్న బెల్లాన్ని నిరంతరం తింటే ఆస్తమా, అలర్జీలు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమరంగులు శరీరంలో చేరితే క్యాన్సర్‌ కారకాలుగా మారుతాయి. బ్లీచింగ్‌ ఏజెంట్లు ఎక్కువగా చేరిన ఆహారం రక్తంలో శుద్ధి ప్రక్రియను దెబ్బతీసి దీర్ఘకాలంలో కిడ్నీలు, లివర్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. కల్తీ బెల్లంతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, పేగుల్లో పుండ్లు ఏర్పడటం సర్వసాధారణంగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement