సైనిక లాంఛనాలతో హవల్దార్‌ కిషన్‌ అంత్యక్రియలు | Havildar Kishans funeral with military honours | Sakshi
Sakshi News home page

సైనిక లాంఛనాలతో హవల్దార్‌ కిషన్‌ అంత్యక్రియలు

Oct 1 2026 5:21 AM | Updated on Oct 1 2026 5:21 AM

Havildar Kishans funeral with military honours

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మృతి చెందిన కిషన్‌

భౌతికకాయాన్ని గ్రామానికి తరలించిన సైనికాధికారులు 

పందిళ్లపల్లె బస్టాండ్‌ నుంచి ర్యాలీగా గ్రామానికి తరలింపు 

అక్కడి నుంచి ఊరేగింపుగా పొలానికి.. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు

బేస్తవారిపేట: దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఆర్మీ హవల్దార్‌ కువ్వరపు కిషన్‌కు కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రు నివాళుల నడుమ సైనిక లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెకు చెందిన ఆర్మీ హవల్దార్‌ కిషన్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నగుల ఆపరేషనల్‌ ఏరియా వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కిషన్‌ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ప్రత్యేక వాహనంలో బుధవారం స్వగ్రామమైన పందిళ్లపల్లె ఎస్సీ కాలనీకి తీసుకొచ్చారు. మాజీ సైనికులు, గ్రామస్తులు, యువకులు పందిళ్లపల్లె బస్టాండ్‌ నుంచి గ్రామంలోకి ర్యాలీగా భౌతికకాయాన్ని తరలించారు. 

కిషన్‌ భౌతికకాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌ 268 మీడియం రెజిమెంట్‌ కెప్టెన్‌ పునిత్‌ కుమార్, సుబేదార్‌ రాజ్‌వీర్‌ సింగ్, ఒంగోలు 34వ బెటాలియన్‌ ఎన్‌సీసీ యూనిట్‌ నాయక్‌ సుబేదార్‌ సుకేందర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నుంచి ఊరేగింపుగా కిషన్‌ మృతదేహాన్ని పొలం వద్దకు తరలించారు. అక్కడ అధికార సైనిక లాంఛనాలు నిర్వహించారు. అనంతరం కిషన్‌ భార్య సంధ్యకు జాతీయ జెండాను అందజేశారు. సైనికులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. 

అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు గృహం వద్ద కిషన్‌ భౌతిక కాయానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఎం విజయసునీత, ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి కిషన్‌ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సైనిక వెల్ఫేర్‌ అధికారి అబ్దుల్‌ రహీమ్, అధికారులు నివాళులర్పించారు. 

కుటుంబాన్ని ఆదుకోవాలి 
దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన కిషన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. ఆయన కుటుంబానికి పొలం, స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి అండగా ఉన్న కిషన్‌ మృతితో తమ కుటుంబం అనాథగా మారిందని, మూడేళ్ల చిన్న కుమారుడు ఉన్నాడని కలెక్టర్‌ విజయ సునీత వద్ద కిషన్‌ భార్య సంధ్య కన్నీరుమున్నీరైంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నానని, ఆదుకోవాలని వేడుకుంది. కిషన్‌ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

ఆర్మీ జవాన్‌ కిషన్‌ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఆర్మీ జవాన్‌ కిషన్‌ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన హవల్దార్‌ కువ్వరపు కిషన్‌ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. భారత్‌ –చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు.

‘దేశం కోసం ఆయ­న చేసిన సేవలకు సెల్యూట్‌ చేస్తున్నాను. హవల్దార్‌ కువ్వరపు కిషన్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అంటూ వైఎస్‌ జగన్‌ బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement