ఇళ్ల పట్టాల కోసం మండుటెండలో నిరీక్షిస్తున్న పట్టాదారులు
సీఎం సభ వద్ద జనం నరకయాతన
ఆరు గంటల పాటు ఎండలో అవస్థలు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన పట్టాదారులు, జనం ఎండకు నిలబడలేక, ఆహారం అందక నరకయాతన అనుభవించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 12 గంటలకే జరుగుతుందని.. అందరూ ఉ.10 గంటలకల్లా స్టేడియంలో ఉండాలని చెప్పడంతో పట్టాదారులు, వారి కుటుంబ సభ్యులంతా ఆ సమయానికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే, మధ్యాహ్నం రెండు గంటలైనా కూడా సీఎం సభకు రాకపోవడంతో వచ్చిన వారు మండుటెండలో ఆకలి కేకలతో అలుమటిస్తూ కనిపించారు. పట్టాల పంపిణీ కౌంటర్ల వద్ద సిబ్బంది తక్కువుగా ఉండడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. గతంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పట్టాలు పనికిరావని చెప్పడంతోనే మళ్లీ వచ్చి ఈ పట్టాలను తీసుకోవాల్సి వస్తోందని లబ్థిదారులు వాపోయారు. ఉదయం రమ్మని చెప్పి తమకు తిండితిప్పలు లేక మండుటెండల్లో సాయంత్రం వరకూ పడిగాపులు కాసేలా చేశారంటూ మహిళలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇక సభ ముగిసిన తర్వాత అధికారులు స్వీట్ బాక్సులు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో అప్పటివరకూ ఆకలితో ఉన్న జనం ఒక్కసారిగా మీద పడడంతో మళ్లీ తోపులాట జరిగింది.
పట్టాలతో పేద కుటుంబాలకు భరోసా
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన పేదలకు పట్టాలు పంపిణీ చేసి మాటాడారు. విశాఖలో 28 వేలమందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు విజయవాడలో 26,401 వేల కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం కలిపి ఇప్పటివరకు 60 వేల మంది పేదలకు పట్టాలిచ్చినట్లు చెప్పారు. రూ.52 వేలకోట్ల విలువైన భూముల్ని పేదలకు ఇచ్చామన్నారు. విజయవాడలో ఇస్తున్న భూముల విలువ రూ.28,112 కోట్లని పేర్కొన్నారు. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించామని, వచ్చే ఏడాదిలోగా మరో 5.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పారు. 2019–24లో పాలకులు ప్రతి ఇంట్లోను ఆస్తుల వివాదాలు సృష్టించారని ఆరోపించారు. సంక్షేమం–అభివృద్ధి–సంపదసృష్టి నిరంతరం జరిగేలా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లు అభివృద్దికి ఖర్చు చేశామన్నారు. 2028 కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా–గోదావరి నీళ్లు పుష్కలంగా మనకు వస్తాయని చెప్పారు.
మహిళా వర్క్ ఫోర్సులో ఏపీ కీలకం
కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం విమెన్ వర్క్ ఫోర్సులో విశాఖ, విజయవాడ ముందంజలో ఉన్నాయని చెప్పారు. విశాఖలో ప్రతి వందమందిలో 42 మంది మహిళలు, విజయవాడలో ప్రతి వందమందిలో 37 మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ప్రతి వందమందిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. కాగా, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశించారు.
చంద్రబాబు సభ ఎదుట పేలిన గ్యాస్ సిలిండర్
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం సభ వద్ద పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణానికి ఎదురు భాగంలో స్టేడియం బయట సోడా బండికి ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి విద్యుత్ తీగలను దాటి 200 మీటర్ల దూరంలో ఇళ్ల మీద నుంచి రోడ్డు మీద పడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు, ప్రజలు పరుగులు తీశారు. అదే గ్యాస్ సిలిండర్ దిశ మారి స్టేడియం వైపు వచ్చి ఉంటే సభా ప్రాంగణంలో వేదికకు దగ్గర్లో పడి పెనుముప్పు వాటిల్లేది.
సీఎం వచ్చిన కాసేపటికే ‘పవర్’ కట్..
పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు జరుగుతుందని చెప్పినా సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2:30 గంటలు దాటిన తరువాత వచ్చారు. ఆయన సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడ పవర్ కట్ అయ్యింది. వేదిక పైకి చేరుకుని మాట్లాడుతుండగా కృష్ణాహోటల్ సెంటర్ వైపు ఉన్న సోడా బండికి అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలింది.


