ఉన్న ఇళ్లకే కాగితాలిచ్చి 60 వేల పట్టాలంటూ చంద్రబాబు ప్రచారం
సీఆర్డీఏలో 50 వేల మంది పేదల స్థలాలు రద్దు
అటకెక్కిన 2,3 సెంట్ల హామీ
వైఎస్ జగన్ కట్టిన ఇళ్లకే బాబు రిబ్బన్లు
సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ప్రభుత్వం 27 నెలల్లో ఒక్క సెంటు భూమి కూడా సేకరించలేదు. అయినా విశాఖలో 28,445, మంగళగిరిలో 5,800, విజయవాడలో 26,401.. మొత్తం 60 వేల మందికి పట్టాలిచ్చామని ‘పట్టాభిషేకం’ సభలు పెట్టారు. భూమే లేకుండా పట్టాలు ఎక్కడివనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇవి కొత్త స్థలాలు కావు. పేదలు దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న స్థలాలకే క్రమబద్ధీకరణ కాగితాలు ఇచ్చారు. విశాఖలో ఇచ్చిన పట్టాలన్నీ ప్రభుత్వ స్థలాలు, కొండవాలు, చెరువు గట్లు, గాజువాకం ఇనాం, యూఎల్‌సీ భూముల్లో ఏళ్లుగా ఉంటున్న వారికే ఇచ్చారు. ఇప్పుడు కన్వేయన్స్ డీడ్లు ఇచ్చి మళ్లీ పట్టాభిషేకం అంటున్నారు. విజయవాడలో కొండలపై ఇళ్లకు, మంగళగిరిలో రెండు దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లకే పట్టాలు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఇళ్లకు పట్టాలిచ్చి పేదల పాత ఇళ్లకు రూ.52 వేల కోట్ల భూముల పంపిణీ అంటూ చెప్పడం చంద్రబాబు మార్కు గారడీయే.
ఇచ్చింది కాగితం.. లాక్కున్నది స్థలం
వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిలువ నీడ లేని 50,793 మంది పేద మహిళలకు 1,402 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసింది. అప్పట్లో దాన్ని అడ్డుకున్న టీడీపీ.. అధికారంలోకి రాగానే ఆ స్థలాలన్నీ రద్దు చేసి అన్యాయం చేసింది. ఇప్పటి వరకు వారికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. 50 వేల మంది పేదల నుంచి స్థలాలు లాక్కున్న చేతులతోనే ఇప్పుడు పట్టాభిషేకం చేస్తుండడం విశేషం.
2, 3 సెంట్ల హామీ ఏమైంది?
పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటి దాకా ఒక్కరికీ కొత్త స్థలం ఇవ్వలేదు. ఇంత వరకు భూ సేకరణ కూడా మొదలు పెట్టలేదు. నవంబర్‌లో మొదలు పెడతామని లీకులు ఇచ్చారు. అసలు పని మొదలు పెట్టకుండా పట్టాభిషేకం అంటూ హడావుడి చేయడం పబ్లిసిటీ స్టంట్ కాక మరేమిటని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ హయాంలో 71,800 ఎకరాల్లో 31 లక్షల మందికి పైగా మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కూటమి సర్కారు 27 నెలల్లో సేకరించింది సున్నా ఎకరాలు. 
ఇళ్లు జగన్‌వి.. రిబ్బన్ బాబుది
5.5 లక్షల ఇళ్లు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అవన్నీ జగన్ హయాంలో మంజూరైన ఇళ్లే. దాదాపు పూర్తయిన వాటికి రంగులేసి రిబ్బన్లు కట్ చేస్తున్నారు. స్థలం జగన్‌ది, ఇల్లు జగన్‌ది.. క్రెడిట్ మాత్రం చంద్రబాబుది.


