పొద్దున్నే పాలు కొన్న దగ్గర్నుంచి.. సూపర్ మార్కెట్‌లో సరుకులు, రెస్టారెంట్‌లో భోజనం, ఏటీఎం నుంచి డబ్బులు.. చివరకు పెట్రోల్ బంక్‌లో ఫుల్ ట్యాంక్ కొట్టించినా సరే.. మనం అడిగినా, అడగకపోయినా మన చేతికి వచ్చేది ఒక చిన్న కాగితం. అదే 'బిల్లు' లేదా 'రిసిప్ట్'. షాపింగ్ అయిపోగానే ఆ చిన్న కాగితాన్ని చాలా క్యాజువల్‌గా మడిచి జేబులోనో, పర్సులోనో, కవర్లలోనో పడేస్తుంటాం.
కానీ, ఆ చిన్న పేపర్ ముక్క.. మీ ప్రాణాలను సైలెంట్‌గా హరించే ఒక 'విషపు బాంబు' అన్న విషయం మీకు తెలుసా..? అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. రిసిప్ట్‌ల రూపంలో మనం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నామని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ చిన్న కాగితంలో అంత ప్రమాదం ఏముంది..? డాక్టర్లు ఎందుకంతలా భయపడుతున్నారు..?
ఏటీఎం స్లిప్పులు, షాపింగ్ బిల్లులు..
మనం రోజూ చూసే ఏటీఎం స్లిప్పులు, షాపింగ్ బిల్లులను సాధారణ కాగితంతో తయారు చేయరు. వాటిని "థర్మల్ పేపర్" (Thermal Paper) అంటారు. సాధారణంగా మనం కాగితంపై ప్రింట్ చేయాలంటే ఇంక్ వాడాలి. కానీ ఈ థర్మల్ ప్రింటర్లలో ఎలాంటి ఇంక్ ఉండదు. మరి అక్షరాలు ఎలా పడతాయి..? ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. ఈ థర్మల్ కాగితంపై ల్యూకో డై (Leuco dye), బిస్ఫినాల్ ఏ (BPA) లేదా బిస్ఫినాల్ ఎస్ (BPS) అనే రసాయనాలతో ఒక పూత పూస్తారు.
ప్రింటర్ లోని వేడి (Heat) ఈ కాగితానికి తగలగానే.. ఆ కెమికల్స్ రియాక్ట్ అయ్యి నల్లటి అక్షరాలుగా మారుతాయి. అంటే మీరు చేతితో పట్టుకున్నది కాగితాన్ని కాదు.. ఒక ప్రమాదకరమైన రసాయన పొరను..! ఈ 'బిస్ఫినాల్ ఏ' (BPA) అనేది ప్లాస్టిక్ తయారీలో వాడే అత్యంత కఠినమైన రసాయనం. థర్మల్ పేపర్‌పై ఉండటం వల్ల, మనం దాన్ని చేతితో పట్టుకోగానే నేరుగా మన చర్మంలోకి, అక్కడి నుంచి రక్త ప్రవాహంలోకి (Bloodstream) కలిసిపోతుంది.
రక్తంలోకి ఆ కెమికల్ వెళితే ఏమవుతుంది..? అన్నదే కదా మీ సందేహం. ఇక్కడే వైద్యులు ఒక భయంకరమైన నిజాన్ని చెబుతు న్నారు. ఈ BPA, BPS అనేవి ‘ఎండోక్రైన్ డిస్రప్టర్స్’ (Endocrine Disruptors). అంటే మన శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను ఇవి తీవ్రంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఈ కెమికల్స్ ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer), మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అమాంతం పెంచుతున్నాయి.
మన రక్తంలో ఈ రసాయనాలు చేరడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా డయాబెటిస్, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు చుట్టుముడతాయి. పిల్లలు పుట్టకపోవడం, పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పడిపోవడం వంటి సమస్యలకు ఈ రిసిప్ట్‌లలో ఉండే రసాయనాలు కూడా ఒక ప్రధాన కారణమేనని తాజా అధ్యయనాలు కుండబద్దలు కొడుతున్నాయి.
కోవిడ్ తర్వాత మనందరికీ అడుగడుగునా హ్యాండ్ శానిటైజర్ వాడటం అలవాటుగా మారింది. కానీ, శానిటైజర్ రాసుకుని ఈ బిల్లును పట్టుకుంటే.. మీరు సాక్షాత్తూ యమపాశాన్ని పట్టుకున్నట్లే..! శానిటైజర్లు, లోషన్లు, క్రీములలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న రంధ్రాలను పెద్దవి చేస్తుంది. ఆ సమయంలో మీరు థర్మల్ రిసిప్ట్ పట్టుకుంటే, మామూలు కంటే 100 రెట్లు వేగంగా, అత్యంత సులువుగా ఈ రసాయనాలు మీ రక్తంలోకి చొచ్చుకుపోతా యని పరిశోధనలు తేల్చాయి.
చెమట పట్టిన చేతులతో లేదా తడి చేతులతో పట్టుకున్నా ఇదే ప్రమాదం పొంచి ఉంటుంది.మరి ఈ ప్రాణాంతక ముప్పు నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవే..వీలైనంత వరకు పేపర్ రిసిప్ట్ లు వద్దని చెప్పండి. ఇప్పుడు ప్రతి షాపులో బిల్లును మొబైల్ కు ఎస్ ఎమ్మెస్ లేదా వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపే ఆప్షన్ ఉంది. దాన్ని ఎంచుకోండి.
ఆహారంతో కలపొద్దు..మనం చేసే అతిపెద్ద తప్పు..
కూరగాయలు, ఫ్రూట్స్, వేడి వేడి ఆహార పదార్థాలు ఉన్న కవర్లలోనే బిల్లును పడేయడం. దీనివల్ల ఆ కెమికల్స్ నేరుగా మీ ఆహారంలోకి చేరుతాయి. బిల్లును ఎప్పుడూ విడిగా ఉంచండి.తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లు పట్టుకోవాల్సి వస్తే.. ఆ తర్వాత హ్యాండ్ శానిటైజర్ వాడకండి. కేవలం సబ్బు, నీళ్లతో మాత్రమే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
షాపింగ్ మాల్స్ లో బిల్లింగ్ కౌంటర్లలో పనిచేసేవారు, బస్సు కండక్టర్లు, టోల్ ప్లాజా సిబ్బంది, డెలివరీ బాయ్స్ రోజూ వందల కొద్దీ బిల్లులు ఇస్తుంటారు. వీరు కచ్చితంగా వేళ్లకు ప్రొటెక్టివ్ క్యాప్స్ (Finger Cots) లేదా గ్లౌజులు వాడటం తప్పనిసరి.
గర్భిణీలు, చిన్న పిల్లలకు ఈ బిల్లులను పొరపాటున కూడా ఇవ్వకండి. గర్భస్థ శిశువు మెదడు, ఎదుగుదలపై ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చూశారుగా.. మనం ఏమాత్రం లెక్కచేయని ఒక చిన్న కాగితం ముక్క మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యంతో పాటు ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ కూడా పెరుగుతున్నాయి. చిన్నపాటి అప్రమత్తత, మనల్ని పెద్ద అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. సో.. నెక్స్ట్ టైమ్ మీ చేతికి ఎవరైనా బిల్ ఇస్తే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
ఇదీ చదవండి: వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!


