‘‘కనిపించకుండా దాక్కుంటూ ఫుడ్‌ డెలివరీ’’ | Bengaluru man now a successful entrepreneur | Sakshi
Sakshi News home page

‘‘కనిపించకుండా దాక్కుంటూ ఫుడ్‌ డెలివరీ’’

Sep 28 2026 5:38 PM | Updated on Sep 28 2026 6:09 PM

Bengaluru man now a successful entrepreneur

బెంగళూరుకు చెందిన కౌశిక్‌ ఖార్వీ అనే యువకుడు ఒకప్పుడు జీవనోపాధి కోసం స్విగ్గీలో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఈటరీ బిజినెస్‌, నిర్వహిస్తూనే సముద్ర ఆహారంపై సలహాలు అందించే మరో వ్యాపారాన్ని ప్రారంభించారు. దాదాపు 9 ఏళ్ల క్రితం డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన కౌశిక్‌ ఖార్వీ బెంగళూరులోని ఏసీఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో చదువుకున్నట్లు ఆయన లింక్డ్ఇన్‌ ద్వారా తెలుస్తోంది. గత వారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో తన ప్రయాణాన్ని ఆయన వివరించారు. ఒకప్పుడు స్విగ్గీలో ఆహారం డెలివరీ చేస్తున్న విషయాన్ని స్నేహితులకు తెలియకుండా దాచేవాడినని చెప్పారు.

“9 ఏళ్ల క్రితం స్విగ్గీ డెలివరీ చేస్తున్నప్పుడు నా స్నేహితులకు కనిపించకుండా దాక్కునేవాడిని” అని కౌశిక్‌ తెలిపారు. తాను డెలివరీ ఏజెంట్‌గా పనిచేసినప్పటి ఫొటోలను పంచుకుంటూ.. “సరిగ్గా 9 ఏళ్ల క్రితం నేను స్విగ్గీలో పార్ట్‌టైమ్‌ డెలివరీ పార్ట్‌నర్‌గా చేరాను. కష్టపడి పనిచేయడం కంటే, నా స్నేహితులు నన్ను కేవలం డెలివరీ వ్యక్తిగానే చూస్తారేమోనన్న భయమే ఎక్కువగా ఉండేది” అని రాశారు.

కెరీర్‌లో సక్సెస్‌ 
దాదాపు దశాబ్దం తర్వాత కౌశిక్‌ బెంగళూరులోని ఆర్‌ఆర్‌ నగర్‌లో ‘మంగళూరు ఇన్‌ బెంగళూరు’ పేరుతో మంగళూరు శైలిలో సముద్ర ఆహారం అందించే ఆహార బండిని నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సముద్ర ఆహారంపై తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ‘కౌశిక్‌ సీఫుడ్స్‌’ను కూడా ప్రారంభించారు. ఇందులో సముద్ర ఆహారంపై వాస్తవ సమాచారం, ఆచరణాత్మక సూచనలు, ఆసక్తికర విషయాలు, తీర ప్రాంత అనుభవాలను సులభంగా అర్థమయ్యేలా పంచుకుంటానని ఆయన తెలిపారు.

తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రముఖ సముద్ర ఆహార రెస్టారెంట్ల వద్ద ఆహారం తీసుకునేందుకు ఎదురుచూసిన స్థాయి నుంచి నగరంలోని ప్రజాదరణ పొందిన సముద్ర ఆహార కేంద్రాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నానని కౌశిక్‌ పేర్కొన్నారు. దీనికి వినియోగదారులు, భాగస్వాములు, తన బృందం అందించిన మద్దతే కారణమని చెప్పారు.

తనకు అవకాశం ఇచ్చిన స్విగ్గీకి కూడా కౌశిక్‌ కృతజ్ఞతలు తెలిపారు. “ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. నా కష్టకాలంలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు స్విగ్గీకి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఆయన కథకు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. కష్టాలను అధిగమించి ముందుకు సాగిన ఉదాహరణగా ఆయనను పలువురు అభివర్ణించారు. ఏ పని చిన్నది కాదని, అన్ని వృత్తులను సమానంగా గౌరవించాలని మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇదీ చ‌ద‌వండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement