ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునేత్ర పవార్ తన భర్త, దివంగత అజిత్ పవార్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. సోమవారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్‌లో ఉన్న అజిత్ పవార్ స్మృతి స్థలాన్ని సందర్శించిన ఆమె.. ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజిత్ పవార్ మరణించి ఎనిమిది నెలలు గడిచినా.. ఆయన లేరనే విషయాన్ని తన మనసు ఇప్పటికీ అంగీకరించడం లేదని సునేత్ర పవార్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇప్పటికీ ఆప్యాయంగా ఆయనను ‘దాదా’ అని పిలుస్తున్నారని తెలిపారు. ఆ ఒక్క మాటలోనే అజిత్ పవార్‌పై వారికి ఉన్న ప్రేమ, నమ్మకం, అనుబంధం కనిపిస్తాయని చెప్పారు.
స్మృతి స్థలంలో నివాళులు
సోమవారం విద్యా ప్రతిష్ఠాన్‌లోని అజిత్ పవార్ స్మృతి స్థలానికి వెళ్లిన సునేత్ర.. ఆయనకు నివాళులర్పించారు. అక్కడ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మనసులో ఉప్పొంగుతున్న భావాలను మాటల రూపంలో ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అజిత్ పవార్ భార్యగా, ఆయన తర్వాత తనపై ఉంచిన బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తిగా.. ఆయన కలలను సాకారం చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని సునేత్ర చెప్పారు. ఆయన జీవితంలో విలువలకు, మానవత్వానికి, సున్నితత్వానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు.
మీరు నేర్పిన విలువలను కాపాడుకుంటా..
అజిత్ పవార్ తనకు నేర్పిన విలువలను జీవితాంతం పదిలంగా ఉంచుకుంటానని సునేత్ర పవార్ తెలిపారు. ప్రజలతో ఆయన ఏర్పరచుకున్న అనుబంధాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పారు. ప్రజల కోసం ఆయన చూసిన కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. అజిత్ పవార్ గత జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణించి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సునేత్ర పవార్ ఆయన స్మృతి స్థలాన్ని సందర్శించి భావోద్వేగంగా స్పందించారు.
ఇదీ చదవండి: ఎల్‌పీయూ ఆందోళనలు.. రంగంలోకి సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే!


