యూపీఐపై కొత్త చార్జీలు.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ! | UPI MDR Charges, Supreme Court To Hear Plea Challenging New Merchant Fee Policy On Monday, Check Details Inside | Sakshi
Sakshi News home page

యూపీఐపై కొత్త చార్జీలు.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ!

Sep 28 2026 10:50 AM | Updated on Sep 28 2026 11:23 AM

UPI Charges Row: Supreme Court Hearing Sep 28th News Updates

యూపీఐ చెల్లింపులపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. రూ.2 వేలు దాటిన కొన్ని యూపీఐ ‘పర్సన్‌ టు మర్చంట్‌’ (పీ2ఎం) లావాదేవీలపై చార్జీలు విధించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలైంది. 

న్యాయవాది అంజన్‌ దత్తా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనా ఈ బెంచ్‌లో సభ్యులుగా ఉన్నారు. 

కొత్త విధానం అమల్లోకి వస్తే రూ.2,000కు మించిన నిర్దిష్ట యూపీఐ పీ2ఎం లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తారు. రూ.75,000, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఈ చార్జీ గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేస్తారు. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులు (పీ2పీ) ఎంత మొత్తమైనా ఉచితంగానే కొనసాగుతాయి. రూ.2,000 వరకు మర్చంట్‌ చెల్లింపులపైనా ఎండీఆర్‌ ఉండదు.

కొన్ని ప్రత్యేక రంగాలకు వేరే రేట్లు నిర్ణయించారు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్‌ వంటి రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున ఎండీఆర్‌ ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్లు, సెక్యూరిటీస్‌, స్టాక్‌బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్‌ విధిస్తారు. దీనికీ రూ.300 గరిష్ఠ పరిమితి ఉంటుంది.

పిటిషన్‌లో ఏం అభ్యంతరం?
కేంద్రం సెప్టెంబర్‌ 14న జారీ చేసిన నోటిఫికేషన్‌, సెప్టెంబర్‌ 15న ప్రకటించిన ఎండీఆర్‌ విధానాన్ని అంజన్‌ దత్తా సవాలు చేశారు. తగిన చట్టపరమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ విధానాన్ని తీసుకొచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌, 2007లోని సెక్షన్‌ 10ఏ సవరణ రాజ్యాంగబద్ధతను కూడా ప్రశ్నించారు.

యూపీఐ, రూపే డెబిట్‌ కార్డులకు వేర్వేరు నిబంధనలు ఎందుకన్న అంశాన్నీ పిటిషన్‌ లేవనెత్తింది. రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలకు చార్జీ లేని రక్షణ కొనసాగుతుండగా.. యూపీఐకి మాత్రం రూ.2,000 దాటిన తర్వాత ఎండీఆర్‌ విధించడం సరైనదేనా అని ప్రశ్నించింది.

ఏం కోరుతున్నారు?
రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ విధించే నిబంధనను రద్దు చేయాలని లేదంటే పూర్తిగా నిలిపివేయాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ప్రత్యామ్నాయంగా.. పారదర్శక సంప్రదింపులు, సంబంధిత డేటా ప్రచురణ, ప్రభావంపై అధ్యయనం చేసిన తర్వాత విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ముఖ్యంగా చిన్న, సూక్ష్మ వ్యాపారాలకు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా సంబంధిత సంస్థలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. అక్టోబర్‌ 15 నుంచి కొత్త ఎండీఆర్‌ విధానం అమల్లోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement