‘రేప్‌ జరగలేదు’ అన్నారు.. ఆ వెంటనే అసలు ట్విస్ట్‌! | LPU Row: Students Say Viral Video Was Scripted Classes Suspended for 10 Days | Sakshi
Sakshi News home page

‘రేప్‌ జరగలేదు’ అన్నారు.. ఆ వెంటనే అసలు ట్విస్ట్‌!

Sep 28 2026 6:56 AM | Updated on Sep 28 2026 6:56 AM

LPU Row: Students Say Viral Video Was Scripted Classes Suspended for 10 Days

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో రేప్‌ ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వచ్చిన ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో విధ్వంసం, పోలీసు వాహనాల ధ్వంసం, జాతీయ రహదారి దిగ్బంధంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఓ వీడియో విడుదల చేసింది. అందులో సంబంధిత హాస్టల్‌ గదిలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులు.. ‘మా గదిలో అలాంటి ఘటన ఏదీ జరగలేదు’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ వీడియో తర్వాత వెలుగులోకి వచ్చిన మరో వీడియోతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ఎల్పీయూ గర్ల్స్‌ హాస్టల్‌-3లోని 504వ గదిలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మోనికా గులాటి విడుదల చేసిన వీడియోలో చూపించారు. తమ గదిలో గత రెండు నెలలుగా ఉంటున్నామని, అక్కడ ఎలాంటి అఘాయిత్యం జరగలేదని విద్యార్థినులు తెలిపారు. పోలీసులు, ఇతర విద్యార్థులు తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.

అయితే ఆ తర్వాత అదే విద్యార్థినులు మరో వీడియోలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యూనివర్సిటీ అధికారులు తమకు ఏం చెప్పాలో ముందుగానే సూచించారని, తాము అదే విషయాలను చెప్పామని వారు ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే వీడియోలోని కొంత భాగాన్ని కట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారని చెప్పారు. తమ సమ్మతి తీసుకోలేదని, దాంతో ఇప్పుడు తాము అనవసరమైన వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

అసలు రచ్చ ఎక్కడ మొదలైంది?
మూడు రోజుల క్రితం ఓ మహిళా విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలతో గర్ల్స్‌ హాస్టల్‌-3 సమీపంలో విద్యార్థుల ఆందోళన మొదలైంది. ఓ ప్లంబర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని, హాస్టల్‌ వార్డెన్‌కు విషయం తెలిసినా చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు.

ఆ విద్యార్థిని అనంతరం ఇంటికి వెళ్లిపోయిందని, ఆమె రూమ్‌మేట్‌ ఇతర విద్యార్థులకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిందని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు.

జలంధర్‌ రేంజ్‌ డీఐజీ నవీన్‌ సింగ్లా మాట్లాడుతూ.. విద్యార్థులు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టామని, ఫోరెన్సిక్‌ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్‌ రికార్డులను పరిశీలిస్తామని చెప్పారు.

రోడ్డెక్కిన వేలాది మంది..
ఆరోపణల నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఉదయం విద్యార్థులు జలంధర్‌–ఫగ్వారా జాతీయ రహదారి-44ను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

పోలీసుల ప్రకారం.. కొందరు ఆందోళనకారులు పోలీసులపై వాటర్‌ బాటిళ్లు విసిరారు. అనంతరం పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు క్యాంపస్‌లోకి వెళ్లి పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించగా, మరో నాలుగు నుంచి ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

ఆరోపణలను ఖండించిన వర్సిటీ
మరోవైపు లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ మాత్రం క్యాంపస్‌లో రేప్‌ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నవన్నీ తప్పుడు, నిరాధార, కల్పిత పుకార్లని రిజిస్ట్రార్‌ మోనికా గులాటి పేర్కొన్నారు.

కొంతమంది ఉద్దేశపూర్వకంగా యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఆందోళనలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ సూచించింది.

కేసు నమోదు.. SIT దర్యాప్తు
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఓ అనుమానితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. సుమారు 15 రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం తేలితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

పది రోజులు క్లాసులు బంద్‌
క్యాంపస్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్‌ 28 నుంచి 10 రోజుల పాటు రెగ్యులర్‌ తరగతులను నిలిపివేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. మిడ్‌టర్మ్‌ పరీక్షలను కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాయిదా వేసింది.

విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని యూనివర్సిటీ తెలిపింది. క్యాంపస్‌లోనే ఉండేవారు హాస్టళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.

ఇదీ చదవండి: ఇదేం అరకోర చర్యలు సర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement