క్యాంపస్ బయట నినదిస్తున్న విద్యార్థులు
విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ విద్యార్థుల ఆందోళన
ఆరోపణల్లో నిజం లేదన్న వర్సిటీ
ఫగ్వారా: పంజాబ్‌లోని ఫగ్వారాలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) ప్రాంగణం విద్యార్థుల ఆందోళనతో అట్టుడికింది. మూడు రోజుల క్రితం క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న ఒక విద్యార్థినిపై ప్లంబర్ అత్యాచారం చేశాడని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ సంఘటన వర్సిటీని కుదిపేసింది. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు హాస్టల్ సమీపంలో నిరసన ప్రారంభమైంది.
అత్యాచార ఘటన గురించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు ఆగ్రహంతో క్యాంపస్‌లోని కిటికీ అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు. కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. ‘మాకు న్యాయం కావాలి’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. పోలీసుల వాహనాలపైనా దాడికి దిగారు. రాళ్లు రువి్వన ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిరసనకారులు క్యాంపస్ వెలుపల ఢిల్లీ–అమృత్‌సర్ జాతీయ రహదారి–44ను దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖాలకు రుమాళ్లు కప్పుకున్న కొందరు నిరసనకారులు యూనివర్సిటీ మాల్‌లోని దుకాణాలను, క్యాంపస్‌లోని ఇతర ఆస్తులను ధ్వంసం చేస్తూ కనిపించారు. మరికొందరు ఒక కిరాణా దుకాణం నుంచి వస్తువులను తీసుకెళ్లారు. క్యాంపస్‌లో ధ్వంసమైన వాహనాలు, విధ్వంసానికి గురైన ఏటీఎం యంత్రం కూడా వీడియోల్లో కనిపించాయి.
ఈ మొత్తం వ్యవహారంపై వర్సిటీ రిజి్రస్టార్ మోనికా గులాటీ స్పందించారు. కొన్ని సంఘవిద్రోహ శక్తులు నిరాధారమైన, కల్పిత ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. ఎల్‌పీయూ వ్యవస్థాపక–చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. వర్సిటీలో ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు విద్యార్థులలో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఎల్‌పీయూ యాజమాన్యం విమర్శించింది. తమ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. వదంతులు నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది.


